
పీఎంవీబీఆర్‌వైతో ఉద్యోగి, యజమానులకూ ప్రయోజనాలు
రాజమహేంద్రవరం రూరల్: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై) కింద నమోదు చేసుకుంటే ఉద్యోగికి అదనపు వేతనం, యజమానికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రాంతీయ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరంలోని పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఈ పథకం అమలుపై క్రెడాయ్, ఇతర సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ పథకం ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వచ్చిందని చెప్పారు. తొలిసారి ఉద్యోగం పొందిన వ్యక్తి ఖాతాలో ఒక నెల ఈపీఎఫ్ వేతనాన్ని (బేసిక్+డీఏ) ప్రభుత్వం రెండు విడతల్లో జమ చేస్తుందన్నారు. గరిష్టంగా రూ.15 వేల వరకు పొందవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 1.92 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. యజమానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. కనీసం ఆరు నెలల నిరంతర ఉపాధి ప్రాతిపదికన నియమించుకున్న ప్రతి అదనపు ఉద్యోగికి యాజమాన్యాలకు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకం అందిస్తుందన్నారు. ఉద్యోగులకు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా, యాజమాన్యాలకు వారి పాన్ అనుసంధానిత ఖాతాల ద్వారా చెల్లింపులు జరుగుతాయన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి 2027 జూలై 31 మధ్యన కల్పించిన ఉద్యోగాలకే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని వివరించారు. 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇందుకు రూ.99,446 కోట్లను కేటాయించినట్టు చెప్పారు.
12 వేల కంపెనీలు
రాజమండ్రి ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయ పరిధిలోని ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 12 వేల కంపెనీలు నమోదై ఉన్నాయని, తప్పనిసరిగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రాంతీయ కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల పీఎఫ్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని, జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. నిర్మాణ రంగంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారని, వారంతా పథక పరిధిలో వచ్చేలా క్రెడాయ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్య నిధి సంస్థలో సభ్యత్వం తీసుకుని, కనీసం ఏడాది సర్వీస్ కలిగిన వారికి ప్రమాద బీమా రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు లభిస్తుందని చెప్పారు. సహాయ పీఎఫ్ కమిషనర్లు యు.శ్రీనివాసరావు, రాధానాథ్ పట్నాయక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ కృష్ణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు వి.శేఖర్, షేక్ జబీనా, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, క్రెడాయ్ ప్రతినిధులు మురళి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కమిషనర్
వెంకటేశ్వర్లు