
దర్శనమంటూ శఠగోపం
జగ్గంపేట: తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇప్పిస్తానని నమ్మించి, మోసం చేసేందుకు యత్నించిన మోసగాడిని జగ్గంపేట పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ బుధవారం తన కార్యాలయంలో వెల్లడించారు. కోనసీమ జిల్లా గుడిమెల్లంక గ్రామానికి చెందిన జి.రాజ్‌కుమార్ అలియాస్ విజయ్‌కుమార్ అలియాస్ వంశీపై పలు చీటింగ్ కేసులున్నాయి. 2020–24 వరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక చోట్ల పలు కేసులు నమోదయ్యాయి. ఇతడిపై సూర్యాపేట, తణుకు, కృష్ణలంక, పాలకొల్లు, నర్సాపురం, ఎల్‌బీ నగర్ (హైదరాబాద్) పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నాయి. గతంలో పాలకొల్లు, తణుకుల్లో నమోదైన కేసుల్లో ఇతడు అరెస్ట్ అయ్యాడు. సోషల్ మీడియా ద్వారా వ్యాపారాలు చేసే వారిని, ధనవంతులను లక్ష్యంగా చేసుకుని, వారికి తాను ప్రముఖ ప్రజాప్రతినిధుల పీఏగా పరిచయం చేసుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతడు గోవా నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ పీఏగా గోకవరం మండలంలోని గోల్డ్ షాపు యజమాని పట్నాల నాగేంద్రకు ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తానని చెప్పి, రూ.50 వేలు ఖర్చవుతాయన్నాడు. అనుమానం వచ్చిన నాగేంద్ర అప్రమత్తం కావడంతో.. రాజ్‌కుమార్ మోసం బయటపడింది. దీనిపై టీటీడీ మెంబర్ జ్యోతుల నెహ్రూ పీఏ ప్రసాద్ జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం జగ్గంపేట వచ్చిన సందర్భంలో అరెస్టు చేశారు. ఇతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
అంతర్రాష్ట మోసగాడి అరెస్టు
తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు