
నారాయణ కళాశాలలో అగ్ని ప్రమాదం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం మోరంపూడి సమీపంలోని సాయినగర్‌లో ఉన్న నారాయణ కళాశాలలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 8.30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, రాజమహేంద్రవరం అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణ కళాశాల నిర్వహిస్తున్న భవనంలో హాస్టల్ ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని సెల్లార్‌కు తరలించారు. బుధవారం ఉదయం సెల్లార్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అప్పటికే కళాశాలలో ఉన్న కొందరు విద్యార్థులను సిబ్బంది అప్రమత్తమై బయటకు పంపిచేశారు. అలాగే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. రాజమహేంద్రవరం ఇన్నీస్‌పేట, ఆర్యాపురం ఫైర్ స్టేషన్లతో పాటు, కొవ్వూరు అగ్నిమాపక శకటాలు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. సెల్లార్ అంతా మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో పరుపులు, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.8 లక్షల నష్టం వాటిల్లింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ఇలాఉండగా విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను వెనక్కు పంపేసినట్టు చెబుతున్నారు.
షార్ట్‌సర్క్యూట్ కారణమై
ఉండవచ్చని అనుమానం