
భూ హక్కుల పరిరక్షణకే ‘రీ–సర్వే’
రాజానగరం: భూ హక్కుల పరిరక్షణ కోసమే ప్రభుత్వం ‘రీ–సర్వే’ నిర్వహిస్తోందని కలెక్టరు పి.ప్రశాంతి తెలిపారు. మండలంలోని తోకాడలో బుధవారం నిర్వహించిన ఆర్‌ఓఆర్ గ్రామసభలో రీ–సర్వే విధానం, ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కలిగించారు. దీనివల్ల అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలు తగ్గుతాయని, రికార్డుల కచ్చితత్వానికి తోడ్పడుతుందన్నారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్ మాట్లాడుతూ గ్రామ విస్తీర్ణం 4674.19 ఎకరాలు ఉండగా, రీ–సర్వే అనంతరం 4654.969 ఎకరాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వ భూమి 341.65 ఎకరాలకు 341.052 ఎకరాలు, ప్రైవేట్ భూమి 4332.54 ఎకరాలకు 4313.91 ఎకరాలుగాను ఖరారైందని వివరించారు. కార్యక్రమంలో సర్వే అధికారి మోహనరావు, తహసీల్దారు జీఏఎల్‌ఎస్ దేవి, సిబ్బంది పాల్గొన్నారు.
15 నుంచి
హ్యాండ్ బాల్ పోటీలు
రాజానగరం: దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో శుక్రవారం నుంచి 18 వరకు సీబీఎస్‌ఈ సౌత్ జోన్ – 1 హ్యాండ్ బాల్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్‌ల నుంచి 1200 మంది క్రీడాకారులు, 120 మంది కోచ్‌లు, మేనేజర్లు హాజరవుతారని శ్రీప్రకాష్ కరస్పాండెంట్ సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఉచిత ప్రవేశాలకు
మరో అవకాశం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు మరోసారి అవకాశం వచ్చింది. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు దదరఖాస్తులకు కల్పించినట్లు ఎస్‌ఎస్‌ఏ జిల్లా ఏపీసీ ఎస్.సుభాషిణి బుధవారం ఆ వివరాలను తెలిపారు. నివాసం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలల్లో ఈ ప్రవేశాలు ఉంటాయన్నారు. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఇది కొనసాగింపని పేర్కొన్నారు. ధరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 31న సీట్లు కేటాయిస్తారని, మరింత సమాచారానికి సీఎస్‌ఈ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో చూడవచ్చునని సుభాషిణి తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల విద్యాశాఖ జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనపరచిన పాఠశాలల నుంచి స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ బుధవారం తెలిపారు. కాకినాడ జిల్లా నుంచి 5 పాఠశాలలకు ఈ అవార్డులు అందిస్తామన్నారు. 2025 సంవత్సరంలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారుల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై పాఠశాల హెచ్‌ఎం, పీడీ సంతంకం చేసి ఈ నెల 18వ తేదీ లోపు కాకినాడలోని ఎస్‌జీఎఫ్‌ఐ కార్యాలయంలో కార్యదర్శి ఎల్.జార్జికి అందజేయాలని కోరారు.