
సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ కుష్వంత్ కుమార్
రాజానగరం: ఆలోచనలకు పదును పెడితే నూతన ఉత్పత్తుల తయారీకి అవకాశం ఉంటుందని, తద్వా రా దేశాభివృద్ధి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్‌లోని మేడివాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్ శాస్త్రవేత్త డాక్టర్ కుష్వంత్ కుమార్ శీరంరెడ్డి అన్నారు. స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) లో మంగళవారం నిర్వహించిన ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ డే ప్రోగ్రామ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినూత్న ఆలోచనలను ఉత్పత్తులుగా మార్చడంలో యూనివర్సిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అంకుర పరిశ్రమల స్థాపనకు మౌలిక వసతులు సమకూర్చడమే తమ లక్ష్యమన్నారు.
రాష్ట్రంలో రెండు వేల వరకూ అంకుర పరిశ్రమలు ఉన్నాయని, ముఖ్యంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన స్టార్టప్స్‌కు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనకాపల్లి రూరల్ ఇన్క్యూబేషన్ సెంటర్ సీఈఓ శ్రీరామ్ భగవతుల మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక అవకాశాల గురించి ప్రస్తావిస్తూ, స్థానిక యువత పరిసరాలలోని సమస్యలను సాంకేతిక సాయంతో పరిష్కరించే దిశగా ఆలోచించాలని సూచించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జీజీయూ చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ కొత్త ఆలోచనలతో ఉత్పత్తులను తీసుకురావడం, వాటికి మార్కెట్ చేయడం ద్వారా భవితకు బంగారు బాట వేసుకునే ప్రయత్నం చేయాలన్నారు. ప్రొ.చాన్సలర్ కె.శశికిరణ్‌వర్మ యూనివర్సిటీ ప్రాంగణంలో 25 వరకు అంకుర పరిశ్రమల ఏర్పాటుకు రిజిస్టర్ అయ్యాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఎస్‌ఆర్‌డబ్ల్యూ వాణిధర్, జీజీయూ వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ఇన్నోవేషన్ డైరెక్టర్ డాక్టర్ వై.మురళీధరరెడ్డి, వాద్వానీ ఫౌండేషన్ డైరెక్టర్ దయాకర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.