
కార్డియాక్ అరెస్ట్ కేసుల నేపథ్యంలో సీపీఆర్ శిక్షణ అ
రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతున్నందున సీపీఆర్ శిక్షణ చాలా అవసరమని, ఎలాంటి సమయంలోనైనా తక్షణమే ప్రతిస్పందించగలిగే ఈ సీపీఆర్ నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. మంగళవారం కాతేరులోని తిరుమల విద్యాసంస్థల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ సీపీఆర్ అనేది గుండెపోటు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయిన వ్యక్తికి సహాయం చేసే ప్రక్రియ అన్నారు. రోటరీ క్లబ్ రివర్ సిటీ ప్రెసిడెంట్ ఎల్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి స్థాయిలు పెరగడంతో యువకుల్లో సైతం కార్డియాక్ అరెస్ట్ ఘటనలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. గుండె ఆగిన మనిషిని దగ్గరలో గల హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లేలోగా అతనికి సీపీఆర్ చేస్తే తిరిగి గుండెను పనిచేయవచ్చునని తెలిపారు. సీపీఆర్ ఎలా చేయాలో డాక్టర్ వేణుగోపాల్‌నోరి, డాక్టర్ ప్రియాంక తెలిపారు. రోటరీ క్లబ్ రివర్ సిటీ సెక్రటరీ ఎ.దీపిక, పీడీపీ భాస్కరరామ్, ఏజీవీవీఎస్ కృష్ణారావు, జోనల్ కమ్యూనిటీ చైర్‌పర్సన్ ఎస్.నాగేంద్రకిషోర్, తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.