జల్సాలకు బానిసలై చోరీల బాట
కడియం: వేమగిరి దేవీజనార్దన్ నగర్‌లో మే 26వ తేదీ జరిగిన చోరీ ఘటనకు సంబంధించి ముగ్గురిని కడియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దేవీజనార్దన్ నగర్‌లో ఒంటరిగా ఉంటున్న దుళ్ళ అనంతలక్ష్మి అనే మహిళ ఇంట్లోకి ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం ఒక యువకుడు, ఇద్దరు యువతులు ప్రవేశించారు. ఆమెను కొట్టి మెడలోని 12 గ్రాముల బంగారు గొలుసు, బీరువాలోని వెండి పూజా సామగ్రి, రూ.5 వేలు దోచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై పట్టా ధనలక్ష్మి ప్రసన్న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్ అల్లు వెంకటేశ్వరరావు, ఎస్సైలు పట్టా ధనలక్ష్మి ప్రసన్న, బి.దుర్గాప్రసాద్, క్రైం కానిస్టేబుల్ కె.సురేష్ బాబు, జి.రవికుమార్ ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తును ముమ్మరం చేశారు.
అనుమానాస్పదంగా..
ఇదిలా ఉండగా వాహనాల తనిఖీల్లో భాగంగా కడియం రైల్వే స్టేషన్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామానికి చెందిన పెరవలి రామ్‌కుమార్, కాకినాడ జిల్లా కొవ్వాడ గ్రామానికి చెందిన భయ్యి ఉష, కాకినాడ జిల్లా పెద్దాపురం మండలానికి చెందిన కాట ఇందిరా ప్రియదర్శినిలను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీంతో వేమగిరిలో చోరీ విషయం వెలుగుచూసింది. వారి నుంచి 216 గ్రాముల వెండి వస్తువులు, 11.40 గ్రాముల బంగారు గొలుసు, రూ.3 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీకి ఉపయోగించిన బ్లాక్ కలర్ మోటారు సైకిల్‌ను కూడా సీజ్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన వీరు ముగ్గురూ బృందంగా ఏర్పడి నేరానికి పాల్పడుతున్నారు. వేమగిరిలో మొట్టమొదటి చోరీ చేశారని, వేగంగా దర్యాప్తు చేయడంతో పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు.
రూ.3 లక్షల బంగారు ఆభరణాల చోరీ
కాకినాడ రూరల్: ఇంటి యజమానులు నిద్రిస్తుండగా, దొంగలు చొరబడి రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిమ్మాపురం రామకృష్ణ నగర్‌లోని ముదునూరి సుబ్బరాజు ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక దొంగలు ప్రవేశించారు. ఆ సమయంలో సుబ్బరాజు, భార్య ఆ గదిలోనే నిద్రిస్తున్నారు. ఆ పక్క గదిలో వారి అమ్మాయి పడుకుంది. దొంగలు ఏమాత్రం భయపడకుండా సుబ్బరాజు గదిలోకి వచ్చి, టేబుల్‌పై ఉన్న తాళాలను తీసుకుని బీరువా తెరిచి బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దొంగలు తిరిగి వెళుతున్న సమయంలో పక్క గదిలోని కుక్క మెరగడంతో సుబ్బరాజుకు మెలకువ వచ్చింది. అప్పటికే దొంగలు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుపై తిమ్మాపురం అదనపు ఎస్సై మూర్తి కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి.
● ఇద్దరు యువతులు, యువకుడి అరెస్టు
● బంగారం, వెండి వస్తువుల స్వాధీనం


