సహజ వాయువు దోపిడీపై నిలదీద్దాం..
అమలాపురం టౌన్: కృష్ణా గోదావరి బేసిన్‌లో ప్రకృతి పరంగా, సహజ సిద్ధంగా లభ్యమవుతున్న చమురు, సహజ వాయువు దోపిడీని అరికట్టాలని, ఈ విషయంలో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని మేధావులు, విద్యావేత్తలు, సహజ వనరుల పరిరక్షణ ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు. చమురు, సహజ వాయువును కేజీ బేసిన్‌లో అన్వేషించి ఇతర రాష్ట్రాలకు దోచుకుని వెళ్లిపోతున్న చమురు సంస్థల నిర్వాకాన్ని అడ్డుకోవాలన్నారు. గ్యాస్, చమురు, సహజ వనరుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్‌క్లబ్ భవనంలో ఆదివారం సదస్సు జరిగింది. పరిరక్షణ కమిటీ ప్రతినిధి కె.సత్తిబాబు ఆధ్వర్యంలో సామాజికవేత్త ఆలతతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, ప్రొఫెసర్ వైవీఎస్ మహాదేవ్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. కేజీ బేసిన్‌లో చమురు, సహజ వాయువుల ఖనిజ సంపద అపారంగా ఉందని గుర్తుచేస్తూ, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. చమురును సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోయి రూ.కోట్లలో లాభాలు ఆర్జిస్తుంటే.. ఇక్కడి అభివృద్ధి మాత్రం కుంటుపడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దోపిడీని నిరోధించేందుకు మనమంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు కలసికట్టుగా చట్టసభల్లో ఈ దోపిడీని ప్రశ్నిస్తే రాష్ట్రానికి రావాల్సిన వాటా దానంతట అదే వస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని వక్తలు సూచించారు. దేశంలో లభ్యమవుతున్న సహజ వాయువుల్లో 30 శాతం కేజీ బేసిన్‌లోనే లభ్యమవుతోందని గుర్తు చేశారు. అన్వేషణలు, కార్యకలాపాల పేరుతో చమురు సంస్థలు కేజీ బేసిన్ భూములను గుల్ల చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంస్థల భారీ వాహనాలతో రోడ్లు ఛిద్రమవుతున్నాయన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సహజ వాయువు సాధన సమితి కన్వీనర్ కొల్లా రాజమోహన్, కోనసీమ రైల్వే సాధన సమితి కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ నాయకుడు వంటెద్దు వెంకన్నాయుడుతోపాటు పలువురు విద్యావేత్తలు, మేధావులు ప్రసంగించారు.
పోరాటాలతో రాష్ట్ర వాటా సాధిద్దాం
చమురు, సహజ వనరుల
పరిరక్షణ సదస్సులో నేతల పిలుపు


