ఆ ఏడుగురినీ విధుల్లోకి తీసుకోండి
అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో శానిటరీ విభాగంలో తొలగించిన ఏడుగురు సూపర్‌వైజర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిఫ్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి.శ్రీనివాసరావు (కాకినాడ) దేవస్థానం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తాత్కాలికంగా శానిటరీ కాంట్రాక్టర్‌చే పని చేయిస్తున్నామని, కొత్త శానిటరీ కాంట్రాక్ట్ ఖరారయ్యాక విధుల్లోకి తీసుకోవాలని చెబుతామని దేవస్థానం అధికారులు చెప్పడంతో ఆ మేరకు ఆయన ఆదేశాలిచ్చారు. ఈ విషయాన్ని తొలగించబడిన సూపర్‌వైజర్లలో ఒకరైన కొల్లు బాబూరావు ఆదివారం తెలిపారు. సూపర్‌వైజర్ల ఫిర్యాదు మేరకు లేబర్ కోర్టు అన్నవరం దేవస్థానానికి నోటీసులు జారీ చేసింది. శనివారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించడంతో దేవస్థానం తరఫున సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సూపర్‌వైజర్లను ఎందుకు తొలగించారని డీసీ ఆఫ్ లేబర్ శ్రీనివాసరావు అధికారులను ప్రశ్నించగా, తాము తొలగించలేదని, శానిటరీ కాంట్రాక్టర్ తొలగించారని వారు సమాధానం చెప్పారు. కాంట్రాక్టర్ ఎందుకు తొలగించారని అడగ్గా ప్రవర్తన బాగోకపోయినా, భక్తులు ఫిర్యాదు చేసినా, పని సామర్థ్యం తగ్గినా కాంట్రాక్టర్‌కు తొలగించే హక్కు ఉందని వారన్నారు. తాము దశాబ్దాల తరబడి శానిటరీ విభాగంలో పనిచేస్తున్నామని, తమ పనితీరు బాగోలేదని ఎవరూ ఫిర్యాదు చేయలేదని సూపర్‌వైజర్లు వివరించారు. దీంతో వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని కాంట్రాక్టర్‌తో చెప్పమనగా, త్వరలో కొత్త కాంట్రాక్టర్ వస్తారని వారికి చెబుతామని అధికారులు చెప్పినట్లు సూపర్‌వైజర్లు తెలిపారు.
తాము కాదని మాట మార్చి..
శానిటరీ సూపర్‌వైజర్లపై వైఎస్సార్ సీపీ ముద్ర వేసి ఈ నెల 15 నుంచి తొలగించారు. అధికార టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు వారిని తొలగించారని సూపర్‌వైజర్లు తెలిపారు. దీనిపై ఈ నెల 18న ‘సాక్షి’ దినపత్రికలో ‘వైఎస్సార్ సీపీ వాళ్లంటూ చిరుద్యోగుల పొట్ట కొట్టారు’ అనే శీర్షికన కథనం వచ్చింది. కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో, లేబర్ కోర్టులో సూపర్‌వైజర్లు ఫిర్యాదు చేయడంతో దేవస్థానం అధికారులు మాట మార్చి వీరిని తొలగించింది తాము కాదని, కాంట్రాక్టర్ అని చెప్పడం చర్చనీయాంశమైంది. కొత్త కాంట్రాక్టర్‌కు వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెబుతామని చెప్పిన అధికారులు, తమ స్థానంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి సిఫార్స్‌తో వచ్చిన ఐదుగురిని సూపర్‌వైజర్లుగా నియమించినట్లు తొలగించిన సూపర్‌వైజర్లు చెప్పారు.
● అన్నవరం దేవస్థానానికి లేబర్ కోర్టు ఆదేశం
● కొత్త కాంట్రాక్టర్‌కు చెబుతామన్న అధికారులు


