స్పందించి.. సాయమందించి
హరిదాసుకు గ్రామస్తుల చేయూత
పెదపూడి: కళ్లు తిరిగి కిందపడి తీవ్ర అనారోగ్యానికి గురైన హరిదాసు సూరిబాబుకు ఆదివారం జి.మామిడాడ (జీఎండీ) గ్రామస్తులు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఇక్కడి సూర్యనారాయణమూర్తి స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి వెంకట నరసింహాచార్యలు తెలిపిన వివరాల ప్రకారం.. జి.మామిడాడలో తాళ్లూరి సూరిబాబు ఎన్నో ఏళ్లుగా ధనుర్మాసం సందర్భంగా గ్రామంలో హరిదాసుగా తిరుగుతూ హరినామ సంకీర్తనలు చేసుకుంటూ ఎంతో నియమ నిష్టలతో ప్రజలంతా బాగుండాలని కోరుకునేవాడు. ధనుర్మాసం పూర్తయిన తర్వాత గ్రామంలో ప్రతి ఇంటికి వెళితే ఎంతో కొంత దానంగా బియ్యం, నగదు ఇవ్వడం అనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే హరిదాసు గ్రామంలో తిరిగేటప్పుడు కళ్లు తిరిగి పడిపోవడంతో వెన్నెముకకు బలమైన గాయం తగిలింది. అసలే అంతంత మాత్రంగా ఆర్థిక పరిస్థితి ఉండడం, వెన్నెముకకు తగిలిన గాయానికి చికిత్స నిమిత్తం రూ.లక్షలు ఖర్చు కావడంతో ఆ కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమ గ్రామం కోసం ఏర్పాటు చేసుకున్న ‘మన ఊరు– ఊరికోసం’ వాట్సాప్ గ్రూప్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు స్పందించి ఎవరికి తోచిన ఆర్థిక సహాయం వారు చేశారు. సుమారు రూ.1.71 లక్షలు సమకూరింది. దీంతో ఆ కుటుంబానికి సూర్యనారాయణమూర్తి స్వామి ఆలయంలో రేజేటి వెంకట నరసింహాచార్యులు, గ్రామస్తుల చేతుల మీదుగా సాయం అందజేశారు.


