అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి
పిఠాపురం: అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని పిఠాపురం సీఐ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. ఆదివారం పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఈ సెర్చ్ నిర్వహించారన్నారు. ఆ ఏరియాలో అనుమానితులను తనిఖీ చేసి వారి నుంచి సరైన పత్రాలు లేని సుమారు 43 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. 15 లీటర్ల సారా సీజ్ చేసి కేసు నమోదు చేశామని అన్నారు. అనుమానితులు కనిపించిన వెంటనే పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు. కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఐ అన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పిఠాపురం టౌన్, రూరల్, గొల్లప్రోలు, కొత్తపల్లి ఎస్సైలు మణికుమార్, జాన్‌బాషా, ఎన్.రామకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


