పదవి కోసం ఫైట్..!
‘ఉనికి’పాట్లు
రాజానగరం టీడీపీలో ఉనికిపాట్లు మొదలయ్యాయి. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కేవలం జనసేన నేతలకే ప్రాధాన్యం ఇస్తూ, టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్‌చార్జి పదవికి ప్రాధాన్యం పెరిగింది. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గతంలో రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా పని చేశారు. అప్పట్లో సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో బొడ్డు వెంకట రమణ చౌదరికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచీ ఆయనే కొనసాగుతున్నారు. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్టును చౌదరి ఆశించగా.. పొత్తులో భాగంగా అది కాస్తా జనసేన ఖాతాలోకి పోయింది. దీంతో భంగపడిన చౌదరి.. చివరకు పార్టీ ఆదేశాలకు కట్టుబడి జనసేన విజయానికి కృషి చేశారు.
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్‌చారి పదవి కోసం ఫైట్ మొదలైందా.. దీనిపై ఇరు వర్గాల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయా.. నియోజకవర్గ పగ్గాల కోసం ఇరు వర్గాలూ నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నాయా.. ఇప్పటికే ఉన్న ఇన్‌చార్జిని తప్పించి, ఆ పదవిని దక్కించుకునేందుకు మరో నేత సీఎం స్థాయిలో పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి.
రాజానగరం నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్య పోరు సాగుతోంది. పార్టీ ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి, సీఎం పర్యటన వ్యవహారాల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గాల మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ తనయుడు అభిరామ్ కొద్ది రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులతో మంతనాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికే ఇన్‌చార్జిగా ఉన్న బొడ్డు వెంకట రమణ చౌదరికి రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీంతో, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని పెందుర్తి వెంకటేష్‌కు ఇచ్చే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.
తనయుడి రంగ ప్రవేశంతో..
ఈ పరిస్థితుల్లో పెందుర్తి వెంకటేష్‌ను సీఎం పర్యటన వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించడంతో ఆయన తనయుడు అభిరామ్ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తున్నారు. తండ్రితో పరిచయం ఉన్న నేతలతో మంతనాలు చేస్తున్నారని సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. తనకు మంత్రి లోకేష్ అండదండలున్నాయని, ఈ పదవి తనకే దక్కుతుందనే ధీమాలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. లోకేష్ నుంచి సైతం ఇప్పటికే సుముఖత వ్యక్తమైనట్లు సమాచారం. మరోవైపు పెందుర్తి వెంకటేష్ సైతం నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం సీఎం చంద్రబాబు స్థాయిలో పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ పరిణామం చౌదరి వర్గంలో ఆగ్రహావేశాలు నింపుతోంది. కష్ట కాలంలో పార్టీకి సేవ చేసిన చౌదరిని నియోజకవర్గ పదవికి దూరం చేయడమేమిటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను సైతం త్యాగం చేసిన నేతను విస్మరించాలని చూడటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో, టీడీపీ శ్రేణులు ఇరు వర్గాలుగా విడిపోయి, తరచూ వివాదాలకు దిగుతున్నారు.
● ఇటీవల సీతానగరం మండలం రఘుదేవపురంలోని పేకాట స్థావరంపై ఓ వర్గం దాడులు చేయించి, కేసు నమోదు చేయడానికి ప్రయత్ని ంచారని మరో వర్గం ఆరోపించింది.
● కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలపై దాడి చేసి, పలువురిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్లు సమాచారం. టీడీపీలోని ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఇది జరిగిందని ఆ పార్టీ శ్రేణులే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య తలెత్తుతున్న విభేదాలతో అధికారులు నలిగిపోతున్నారు.
రాజానగరం టీడీపీలో ముసలం!
నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం పట్టు
ఇరు వర్గాలుగా విడిపోయిన చౌదరి,
పెందుర్తి వర్గాలు
చంద్రబాబు వద్ద చక్రం
తిప్పుతున్న వెంకటేష్ తనయుడు
పదవి కోసం ఫైట్..!


