ముస్లింలపై పవన్‌వి దిగజారుడు వ్యాఖ్యలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజకీయ స్వలాభం, మతోన్మాదుల మెప్పు కోసం ముస్లింలను ఉగ్రవాదులతో పోల్చుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మహమ్మద్ ఆరిఫ్ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని, వాటిని వెంటనే వెనక్కి తీసుకొని, ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన కార్యాలయంలో ఆరిఫ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత గడ్డపై పుట్టిన ఎందరో ముస్లింలు దేశ అభ్యున్నతి కోసం జీవితాలనే అంకితం చేశారని, దేశ విద్యా శాఖ మంత్రులుగా, రాష్ట్రపతులుగా విశిష్ట సేవలందించిన సమాజం పట్ల కొంత విషయ పరిజ్ఞానంతో మాట్లాడటం మంచిదని హితవు పలికారు. యుద్ధానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ సైతం మన దేశం వైపు కన్నెత్తి చూడటానికి భయపడుతోందంటే దానికి కారణం భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ దేశానికి అందించిన అణు సామర్థ్యమేనని, ఆయన కూడా ఒక ముస్లిమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. విదేశీ ముష్కరుల ఆగడాలను అరికట్టలేక, ప్రజల దష్టిని మరల్చేందుకు ముస్లింలపై అభాండాలు వేయడం, వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయడమేనని, ఇలాంటి వ్యాఖ్యలను కులమతాలకతీతంగా పౌర సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం టోపీలు పెట్టుకుని ప్రసంగాలివ్వడం, ముస్లింల ఇళ్లకు వెళ్లి వారిని కీర్తించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పట్ల ఇంతటి ద్వేషపూరిత వైఖరి ప్రదర్శించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికై నా జనసేనలో ఉన్న మైనార్టీ నాయకులు పవన్ వ్యాఖ్యలపై నిలదీయాలని, లేకుంటే ఆత్మ పరిశీలన చేసుకుని, జనసేన నుంచి బయటికి వచ్చి ముస్లిం సమాజం గౌరవమర్యాదలను కాపాడాలని అన్నారు. లేకుంటే జాతి ద్రోహులుగా మిగిలిపోతారని ఆరిఫ్ హెచ్చరించారు.


