ధాన్యపురాశిని ఢీకొని యువకుడి మృతి
దేవరపల్లి: రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం రాసులను ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కధనం ప్రకారం మండలంలోని కొత్తగూడేనికి చెందిన పుట్టా వీరవెంకటరమణ(30) గురువారం సాయంత్రం యర్నగూడెంలోని తన తండ్రి వద్దకు వెళ్లాడు. తండ్రితో మాట్లాడి అర్ధరాత్రి సమయంలో తిరిగి గుండుగొలను–కొవ్వూరు 16వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో బైక్‌పై వస్తుండగా, రోడ్డుపై ఆరబెట్టి ఉన్న ధాన్యం రాశులను ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో వీర వెంకటరమణ రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. అయితే అర్ధరాత్రి సమయం కావడం, ఆ సమయంలో అటు వైపు ఎవరూ వెళ్లకపోవడంతో రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న వీరవెంకటరమణను ఎవరూ చూడలేదు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది గమనించి స్థానిక పోలీసుల సహకారంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరవెంకటరమణను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సత్యనారాయణ తల్లి ఏడాది క్రితం మృతి చెందగా, తండ్రి ఉన్నారు. తండ్రి యర్నగూడెంలో ఉంటుండగా, వెంకటరమణ కొత్తగూడెంలో ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి. సుబ్రహ్మణ్యం తెలిపారు.
రాత్రి వేళ రాకపోకలు లేక
ఎవరూ గుర్తించని పరిస్థితి
తెల్లవారు జామున 3 గంటల
వరకు రోడ్డుపైనే పడిఉన్న వైనం
హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి
పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలింపు
అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ


