సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)/రాజానగరం: నగరంలోని లాలాచెరువు రహదారిలో ‘అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన‘కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి (క్రియేటివిటీ అండ్ కల్చరల్) కమిషన్ చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు.గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ‘అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన‘ వాల్‌పోస్టర్‌ను కల్చరల్ డైరెక్టర్ ఎం.మల్లికార్జునరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పి.తేజస్వి మాట్లాడుతూ రాష్ట్రంలో కళలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4న ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 500 మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా వచ్చే నిధులతో రాజమహేంద్రవరంలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఈ వీధి ప్రదర్శన కొనసాగిస్తామని చెప్పారు. ఆమె ఆదికవి నన్నయ యూనివర్సిటీని సందర్శించి వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీని కలుసుకుని వీధి ప్రదర్శనపై చర్చించారు. అనంతరం ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ని విడుదల చేశారు.