మండపేట: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. మండలంలోని పాలతోడు గ్రామానికి చెందిన తాతపూడి రాజేశ్వరి 16 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా అదే గ్రామంలో పని చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన తల్లిపై గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తల బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆమె కుమారుడు నవీన్ తెలిపారు. తన తల్లిపై లేనిపోని అభియోగాలు మోపి, ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నామని చెప్పారన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు ఉన్నవి లేనివి చెప్పి, తన తల్లిని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ ఒత్తిడి చేశారని చెప్పారు. గతంలో ఉపాధి హామీ పనులపై ఆడిట్ జరిగితే గ్రామంలోని ఒకే కుటుంబంలో రెండు జాబ్ కార్డులున్నాయంటూ ఆడిట్ అధికారులు తన తల్లిని ప్రశ్నించారని, దీనిపై కలెక్టర్‌కు, డ్వామా పీడీకి వివరణ ఇచ్చారని చెప్పారు. దీనిని పరిశీలించిన ఉన్నతాధికారులు ఆమె ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పారన్నారు. అయితే గ్రామంలోని టీడీపీ నాయకులు మందపల్లి శ్రీనుబాబు, మందపల్లి రాజబాబు, తాతపూడి లాజర్, పండా వీర్రాజు తన తల్లిపై ఎమ్మెల్యే వేగుళ్లకు నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఈ నేపథ్యంలో ఆమెను ఉద్యోగం తొలగించారని చెప్పారు. సుమారు మూడు నెలలుగా తన తల్లిపై కక్ష సాధిస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పేరు చెప్పి తన తల్లి రూ.40 లక్షల వరకూ సంపాదించిందంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. పైగా ఆమె ఉద్యోగాన్ని వేరొకరికి ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.3 లక్షల లంచం కూడా తీసుకున్నారని నవీన్ ఆరోపించారు. డబ్బు కోసం తన తల్లిపై లేనిపోని నిందలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు ఉత్తమ అవార్డులు అందుకున్న తన తల్లి టీడీపీ శ్రేణుల వేధింపుల నేపథ్యంలో ఈ నెల 25న పురుగుల తాగి, చచ్చిపోవాలనుకున్నదని విలపించారు. ఆమెకు ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని నవీన్ చెప్పారు.