
కపిలేశ్వరపురం: ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి కళారంగం నుంచి ఈ ఏడాది ఎంపికైన డి.ఉమామహేశ్వరి హరికథా నేపథ్యం కపిలేశ్వరపురంలోనే ఆరంభమైంది. ఆమె తండ్రి లాలాజీరావు మచిలీపట్టణానికి చెందిన నాదస్వర విద్వాంసుడు. ఆయనతో కళా ప్రదర్శనలకు వెళ్తున్న క్రమంలో ఉమామహేశ్వరి హరికథ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. 1973లో కపిలేశ్వరపురంలోని శ్రీ సర్వారాయ హరికథా పాఠశాలలో చేరి, సంస్కృతంలో హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. సంస్కృతంలో హరికథ చెప్పగలిగే ఏకైక మహిళా భాగవతారిణిగా గుర్తింపు పొందారు. 1994 వరకూ పాఠశాలలోనే ఉంటూ దేశంలోని బెనారస్ వంటి అనేక యూనివర్శిటీల్లో హరికథా ప్రదర్శనలిచ్చారు. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్వార్డ్ వర్సిటీలో సైతం ఆమె హరికథ చెప్పడం విశేషం. అంతటి ఖ్యాతికెక్కిన ఉమామహేశ్వరికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడంపై కపిలేశ్వరపురం ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.