ఒకటి నుంచి పెరిగిన పింఛన్ల పంపిణీ | Sakshi
Sakshi News home page

ఒకటి నుంచి పెరిగిన పింఛన్ల పంపిణీ

Published Sat, Dec 30 2023 11:44 PM

- - Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.2,750ను రూ.3 వేలకు పెంచినట్టు డీఆర్‌డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌వీవీఎస్‌ మూర్తి శనివారం ప్రకటనలో తెలిపారు. పెరిగిన పింఛన్ల పంపిణీ ప్రజాప్రతినిధుల సమక్షంలో జనవరి ఒకటి నుంచి 8వ తేదీ వరకూ జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 3న కాకినాడలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని, అదే రోజు కలెక్టరేట్‌ కార్యాలయాల్లో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మంత్రులు, కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ప్రస్తుతం జిల్లాలో 18 రకాల పింఛన్లు 2,44,840 ఉన్నాయని, వాటికి రూ.67.57 కోట్లు పంపిణీ చేస్తున్నారన్నారు. వీటిలో 8 రకాల పింఛన్లను రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచడం ద్వారా పంపిణీ సొమ్ము రూ.72.66 కోట్లకు పెరగనుందన్నారు. ప్రస్తుతం ఉన్న 2,44,840లకు అదనంగా ఆరునెలలకు ఒకసారి కొత్తగా మంజూరయ్యే పింఛన్లు సుమారు 10,000 వరకూ ఉన్నాయన్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్‌ జరుగుతుందని, దీంతో పింఛన్లు 2,54,000కు చేరుకుని, వీటి పంపిణీ నిమిత్తం రూ.75 కోట్లు వరకూ ఖర్చు అవుతుందన్నారు.

నిడదవోలు అర్బన్‌లో జనవరి ఒకటో తేదీన, నిడదవోలు రూరల్‌, తాళ్లపూడి, గోకవరం, దేవరపల్లి మండలాల్లో రెండున, అనపర్తి, కడియం, సీతానగరాల్లో మూడున, పెరవలి, బిక్కవోలు, చాగల్లు, కొవ్వూరు రూరల్‌, కొవ్వూరు అర్బన్‌, రాజమహేంద్రవరం రూరల్‌, రాజమహేంద్రవరం అర్బన్‌, రాజానగరాల్లో నాలుగున, గోపాలపురం, రంగంపేటల్లో ఐదో తేదీన, కోరుకొండ, నల్లజర్ల, ఉండ్రాజవరం మండలాల్లో ఆరున పింఛన్ల పంపిణ జరుగుతుందన్నారు.

Advertisement
Advertisement