
దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేస్తున్న చార్లెస్
మామిడికుదురు: పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో తమిళనాడులోని నమ్మక్కళ్ జిల్లా కేంద్రానికి చెందిన అన్బూ చార్లెస్ దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా ఆయన మంగళవారం మామిడికుదురు చేరుకున్నారు. ఈ యాత్రను 2005 ఏప్రిల్ 22న చేపట్టానన్నారు. ఇంతవరకూ 20 రాష్ట్రాల్లో 47 వేల కిలోమీటర్ల మేర తన యాత్ర సాగిందని చెప్పారు. కోవిడ్ కారణంగా మూడేళ్లు సైకిల్ యాత్రను నిలిపివేశానని, పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి ప్రారంభించానని తెలిపారు. ప్రస్తుతం తన వయస్సు 67 ఏళ్లు అని, ఎంఏ (సోషియాలజీ) చదివానని చెప్పారు. తన సైకిల్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, లేకుంటే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని చార్లెస్ అన్నారు. ఒంటరివాడినైన తాను ప్రాణం ఉన్నంత వరకూ సైకిల్ యాత్ర కొనసాగిస్తూనే ఉంటానని చెప్పారు.