
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ భరత్ రామ్
రాజమమేంద్రవరం సిటీ: జగమంత కుటుంబంగా ఎదిగిన జగనన్నను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు. స్థానిక వై.జంక్షన్‌లోని ఆనం రోటరీ హాల్లో శుక్రవారం జరిగిన వైఎస్సార్ సీపీ నగర సోషల్ మీడియా ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైతే పార్టీ పటిష్టత కోసం నిస్వార్థంగా పనిచేస్తారో అటువంటి వారి సేవలు గుర్తించి, భవిష్యత్తులో సమున్నత స్థానాన్ని జగనన్న కల్పిస్తారన్నారు. కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్‌ను ప్రతి ఒక్కరూ సైనికుల్లా తిప్పికొట్టాలన్నారు. 2024 ఎన్నికల్లో సిటీ నియోజక వర్గం నుంచి మన పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, మజ్జి అప్పారావు, పితా రామకృష్ణ,నక్కా నగేష్, తదితరులు పాల్గొన్నారు. కాగా.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సిరుగుడి పైడిరాజు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు ఎంపీ భరత్ రామ్, సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, క్లస్టర్–3 అధ్యక్షుడు మజ్జి అప్పారావు సాదరంగా ఆహ్వానం పలికారు.