మూడేళ్ల క్రితం కులాంతర వివాహం.. యువకుడి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

మూడేళ్ల క్రితం కులాంతర వివాహం.. యువకుడి దారుణ హత్య

Published Sun, Jun 18 2023 9:20 AM

- - Sakshi

తూర్పు గోదావరి: నిద్ర పోతున్న ఓ యువకుడిపై గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి, హత మార్చిన ఘటన నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సమిశ్రగూడెం గ్రామానికి చెందిన షేక్‌ హఫీజ్‌ (23) అదే గ్రామానికి చెందిన తలారి భవానీ(హసీనా)ని ప్రేమించి, మూడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు.

ఈ పెళ్లికి హఫీజ్‌ పెద్దలు అంగీకరించలేదు. దీంతో అతడు భార్య హసీనా ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులందరూ ఇంట్లోను, ఆరుబయట మంచంపై హఫీజ్‌ ఒక్కడూ పడుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హఫీజ్‌ ముఖంపై బలవంతంగా నొక్కి, తల వెనుక వైపు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చారు. రక్తమడుగులో ఉన్న భర్త హఫీజ్‌ను చూసి భార్య హసినా కేకలు వేయగా, ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ వీఎస్‌ఎన్‌ వర్మ, సీఐ కె.వెంకటేశ్వరరా పరిశీలించారు. హఫీజ్‌ పనీ పాట లేకుండా స్థానికంగా యువకులతో కలిసి పలు గొడవలకు వెళ్తూండటంతో పాత కక్షల నేపథ్యంలో దుండగులు అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా ట్రైనీ ఐపీఎస్‌ పంకజ్‌కుమార్‌ పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement