చక్కటీ సంరక్షకా.. | - | Sakshi
Sakshi News home page

చక్కటీ సంరక్షకా..

Mar 16 2026 7:47 AM | Updated on Mar 16 2026 7:47 AM

వ్యాధుల నివారణకు వ్యాక్సిన్‌ తప్పనిసరి

క్రమం తప్పకుండా వేయిస్తే మేలు

నేడు జాతీయ టీకా దినోత్సవం

కపిలేశ్వరపురం/ నల్లజర్ల: వ్యాధుల నుంచి జీవితాంతం రక్షణ పొందాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి.. గర్భిణుల నుంచి అప్పుడే పుట్టిన చిన్నారులకూ ఆయా టీకాలు, వ్యాక్సిన్లు వేస్తే వ్యాధులు దరిచేరవు. 11 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి టీకాలు చిన్నారులను కాపాడతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం మాతా, శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు వివిధ రకాల టీకాలను అందిస్తోంది. గర్భిణులు, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు నిర్ధేశించిన టీకాలు తప్పనిసరి చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించే లక్ష్యంతో 90 రోజుల పాటు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను చేపట్టింది. సోమవారం జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..

వ్యాక్సిన్‌ ఇలా..

● గర్భిణిగా నిర్ధారణ అయిన 3 నెలల తర్వాత టీటీ ఇంజెక్షన్‌ ఇవ్వాలి. నెల రోజుల వ్యవధిలో మరోసారి టీటీ ఇంజెక్షన్‌ చేయాలి. వీటితో పాటు ఐరన్‌, పోలిక్‌, కాల్షియం ట్యాబ్లెట్లు అందించాలి.

● చిన్నారులకు 9 నెలల నుంచి 12 నెలల వ్యవధిలో తట్టువ్యాధి రాకుండా మీజిల్స్‌, కంటి, చర్మ వ్యాధులు రాకుండా విటమిన్‌–ఏ చుక్కలు వేయించాలి.

● 16 నెలల నుంచి 24 నెలల వయసులో బూస్టర్‌ డోస్‌ టీపీటీ, మీజిల్స్‌, విటమిన్‌–ఏ ఓపీ వేయించాల్సి ఉంటుంది.

● ఐదేళ్లు పూర్తయిన తర్వాత డీపీటీ డోసు వేయించాలి.

● 10– 16 ఏళ్లు పూర్తయితే టెటనస్‌ టెక్సాయిడ్‌ (టీటీ) చేయించాలి.

గర్భిణులకు ఎఫ్‌సీఎం ఇంజెక్షన్‌

ఏటా ఒక్కో జిల్లాలో సుమారు 20 వేల ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణుల్లో రక్తహీనత నివారణ కోసం ఇంతకు ముందు ఐరన్‌, సుక్రోజ్‌ టీకాలు వేసేవారు. వాటి స్థానంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్రిక్‌ కార్బాక్సీ మల్టోస్‌ (ఎఫ్‌సీఎం) ఇంజెక్షన్‌ ఉచితంగా ఇస్తున్నారు. దీనిని రెండు సార్లు వేస్తే గర్భిణులు రక్తహీనత నుంచి బయట పడతారు.

మచ్చుకు కొన్ని టీకాలు

బీసీజీ: క్షయ వ్యాధి నివారణకు పుట్టిన 24 గంటల్లోపు 0.05 ఎంఎల్‌, నెల దాటిన పిల్లలకు 0.1 ఎంఎల్‌ మోతాదులో బీసీజీ టీకా వేస్తారు.

హెపటైటిస్‌–బి: పచ్చ కామెర్ల వ్యాధి నివారణ కోసం పుట్టిన 24 గంటల్లోపు 0.5 ఎంఎల్‌ మోతాదులో వ్యాక్సిన్‌ ఇస్తారు.

ఓపీవీ: పోలియో వ్యాధి నివారణకు ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ను పుట్టిన సమయంలోనూ, 6, 10, 14 వారాలు, ఏడాదిన్నరకు చుక్కల రూపంలో నోటి ద్వారా వేస్తారు.

రోటా వైరస్‌: పిల్లల్లో నీళ్ల విరేచనాల నివారణకు రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ను 6, 10, 14 వారాల్లో ఐదేసి చుక్కల చొప్పున నోటి ద్వారా వేస్తారు.

బాలికలకు హెచ్‌పీవీ టీకా

క్యాన్సర్‌ బాధితుల్లో 60 శాతం మంది మహిళలు ఉంటున్నారు. గర్భాశయ క్యాన్సర్లను నిరోధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 14–15 ఏళ్ల బాలికలకు హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) టీకాను ఉచితంగా వేస్తుంది. 2011 మార్చి 1 నుంచి 2012 ఫిబ్రవరి 28 లోపు పుట్టిన బాలికలు అర్హులు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్రంలో, మార్చి 10న ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగనుంది. సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రి, అదనపు జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో బుధ, శనివారాల్లో వ్యాక్సిన్ల కార్యక్రమాల్లో కూడా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో 13,964 బాలికలకు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 10,989, కాకినాడ జిల్లాలో 15,413, మంది బాలికలకు టీకాలను వేయాలన్నది లక్ష్యం. కాకినాడ జిల్లాకు 7,922, కోనసీమకు 4,912, తూర్పుగోదావరి జిల్లాకు 7,688 డోసులు అందుబాటులో ఉన్నాయి. బాలికలు ఏదైనా తిన్న తర్వాతే టీకా వేయించుకోవాలి. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా నిర్ధారణ చేసుకుని టీకా వేసి ప్రధాని మోదీ ఫోటోతో ఉన్న సర్టిఫికెట్‌ ఇస్తారు. టీకా వేశాక కొద్దిపాటి జ్వరం రావొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement