కరువు కాటేసి.. కన్నీళ్లు ముంచేసి.. | - | Sakshi
Sakshi News home page

కరువు కాటేసి.. కన్నీళ్లు ముంచేసి..

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

సాక్షి, అమలాపురం: మొదట్లో చినుకు పడక ఆకాశం వైపు ఆశగా చూసిన అన్నదాత.. చి‘వరి’లో వర్షం కారణంగా వణుకు తగ్గక కన్నీరు మున్నీరవుతున్నాడు. తొలి అర్ధ భాగం అనావృష్టి, మలి అర్ధభాగం అతివృష్టిని ఎదుర్కొన్నాడు.. ఈ ఏడాది కోనసీమలో రైతన్నలు దుర్భర పరిస్థితిని అనుభవించారు. జూన్‌ నుంచి ఆగస్టు వరకు వరుణుడు ముఖం చాటేయడంతో సాగు ప్రశ్నార్థకమైంది. సగటు కంటే సగానికి పైగా వర్షపాతం లోటు.. వేసవిని తలపించిన ఎండలు.. గోదావరిలో నీళ్లున్నా చివరి ఆయకట్టుకు అందని సాగునీరు.. ఎండిపోయిన వరి చేలు.. వట్టిపోయిన కొబ్బరి, ఆయిల్‌పామ్‌ గెలలు.. నీరసించిన కూరగాయ, ఉద్యాన పంటలు.. ఇలా తొలి మూడు నెలలూ రైతును కరువు కాటేసింది.

సెప్టెంబర్‌ నెల నుంచి పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. అర్నబ్‌, మురసు తుపాన్లు కోనసీమపై విరుచుకుపడ్డాయి. దఫదఫాలుగా కురిసిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. చెరువులు, కాలువలు పొంగిపొర్లాయి. పొలాలు చెరువులను తలపించాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నీట మునిగి నేలకొరిగింది. జిల్లాలో ఏకంగా 1.08 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ఇళ్లు, రహదారులు ముంపునకు గురయ్యాయి. కొన్ని ప్రాంతాలు రోజుల తరబడి జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. విద్యుత్‌ కష్టాలు ప్రజలకు కాళరాత్రులను మిగిల్చాయి. తాగునీరు దూరమైంది.

రెండుసార్లూ రైతుకే దెబ్బ

జూన్‌ నుంచి ఆగస్టు వరకు వర్షం లేక పంటలు ఎండిపోతే.. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు కురిసిన అధిక వర్షాలు పంటలను ముంచేశాయి. తొలి అర్ధ భాగంలో పెట్టుబడులు పెట్టినా దిగుబడి ఆశలు ఆవిరయ్యాయి. రెండో అర్ధభాగంలో పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి బలైంది. అటు అనావృష్టి... ఇటు అతివృష్టి నష్టాలు తెచ్చిపెట్టింది. జూన్‌ నుంచి నవంబర్‌ 13 వరకు జిల్లాలో 938.31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 939.03 మిల్లీమీటర్లతో పోలిస్తే కేవలం 0.08 శాతం లోటు మాత్రమే. దీంతో లెక్కల్లో వర్షపాతం సాధారణ స్థాయికి చేరినా.. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు మాత్రం అసాధారణంగా మిగిలాయి.

తొలి అర్ధభాగం.. వర్షాభావం

జూన్‌ నుంచి ఆగస్టు నెలాఖరు వరకూ 584.1 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను కేవలం 263.2 మి.మీ. మాత్రమే కురిసింది. ఈ మూడు నెలలకు కలపి 54.9 శాతం లోటు వర్షం పడింది. జూన్‌లో 49 శాతం, జూలైలో 48 శాతం, ఆగస్టులో ఏకంగా 65 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్‌ సాగు తీవ్ర ఒడిదొడుకులకు గురైంది.

మలి అర్ధభాగం.. వర్ష బీభత్సం

సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ 13 వరకు సాధారణ వర్షపాతం 448.79 మి.మీ. కాగా, ఏకంగా 694.55 మి.మీ. కురిసింది. సాధారణం కంటే 54.76 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో 73.98 శాతం, అక్టోబర్‌లో 10.95 శాతం, నవంబర్‌ 1 నుంచి 13 వరకు 133.71 శాతం అధిక వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలే కోనసీమ రైతుల పాలిట శాపంగా మారాయి. మొత్తంగా పంటలను ముంచేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement