● పెద్ద పంచాయతీలపైనే అందరి గురి
● ఆదాయ వనరులు ఎక్కువగా
ఉండడమే కారణం
● రావులపాలెం, కొత్తపేట,
మలికిపురాలకు భారీ డిమాండ్
● బండారులంక, పేరూరు,
కామనగరువుపైనా కన్ను
సాక్షి, అమలాపురం: పోటీకి ఉరకలేస్తున్నారు.. పల్లె పోరుకు మేము సైతం అంటున్నారు.. పరిషత్ పోరులో రిజర్వేషన్లు అనుకూలించినా దూరంగా ఉన్నవారు ఇప్పుడు పెద్ద పంచాయతీలపై కన్నేశారు.. మండల పరిషత్, జిల్లా పరిషత్ పదవుల కంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ పీఠాలపైనే ఆశావహులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అధిక ఆదాయ వనరులు, వాణిజ్య కార్యకలాపాలు, భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశాలున్న మేజర్ పంచాయతీలపై రాజకీయ నేతలు గురిపెట్టారు. పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించినా, చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి దూరంగా ఉండడానికి సర్పంచ్ పీఠం మీద ఉన్న ఆసక్తి వల్లే. పరిషత్ ఎన్నికల నాటికే సర్పంచ్‌ల రిజర్వేషన్‌లు ఖరారు కావడం వీరికి కలిసి వచ్చింది.
గ్రామ ప్రథమ పౌరుడిగా గుర్తింపు, స్థానికంగా రాజకీయ పలుకుబడి, పంచాయతీ నిధుల వినియోగంలో కీలక పాత్ర.. ఇవన్నీ సర్పంచి పదవికి ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, స్థానికంగా సమకూరే ఆదాయంతో గ్రామంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యాలు నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఎంపీపీ, జెడ్పీటీసీలకు మండల, జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ.. గ్రామంలో ప్రత్యక్షంగా పాలనను ప్రభావితం చేసే అవకాశం సర్పంచ్‌కి ఉండటంతో ఈ పదవికి డిమాండ్ పెరుగుతోంది.
ఆదాయమే అసలు ఆకర్షణ
జిల్లాలో రావులపాలెం, కొత్తపేట, మలికిపురం, బండారులంక, పేరూరు, కామనగరువు, అంబాజీపేట మండలం మాచవరం, రామచంద్రపురం మండలం ద్రాక్షారామ వంటి మేజర్ పంచాయతీలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటిలో కొన్ని పంచాయతీల వార్షిక ఆదాయం సుమారు రూ.కోటి నుంచి రూ.3.50 కోట్ల వరకు ఉంటోంది. జనాభా, నివాస ప్రాంతాల విస్తరణ, వ్యాపార సముదాయాలు, వాణిజ్య సంస్థల కారణంగా ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులు, ఇతర రుసుముల రూపంలో గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. మార్కెట్లు, దుకాణ సముదాయాలు, పంచాయతీ ఆస్తుల అద్దెలు, చెరువుల లీజుల కూడా ఆదాయానికి తోడవుతున్నాయి. ఇంతటి ఆర్థిక వనరులున్న పంచాయతీకి ప్రాతినిధ్యం వహించడం ద్వారా స్థానికంగా రాజకీయ పట్టు పెంచుకోవచ్చన్నది ఆశావహుల ఆలోచన.
పెరిగిన ప్రాధాన్యం
అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న బండారులంక, పేరూరు, కామనగరువు పంచాయతీలకు మరో ప్రత్యేకత ఉంది. జిల్లా కేంద్రంగా అమలాపురం విస్తరిస్తోంది. ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. నివాస కాలనీలు విస్తరిస్తుండగా, భూముల విలువ కూడా పెరుగుతోంది. భవిష్యత్తులో పట్టణ విస్తరణకు అవకాశాలున్న ఈ పంచాయతీలపై రాజకీయ నాయకులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేరూరు, బండారులంక వంటి పంచాయతీల్లో సర్పంచి పదవుల కోసం భారీ ఆఫర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. మరోవైపు రావులపాలెం, కొత్తపేట, మలికిపురం వాణిజ్య కేంద్రాలుగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. దీంతో ఆయా పంచాయతీల్లో పాలనాపరమైన నిర్ణయాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం పెరిగింది. అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ సర్పంచి పదవి జనరల్ కావడంతో అక్కడ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఈ పంచాయతీలపై స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు శాసనసభ్యుల స్థాయి వరకు భాగస్వాములు అవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


