అమలాపురం టౌన్: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సమానంగా, సకాలంలో డీఆర్‌లు విడుదల చేయాలని ఏపీ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ యూనిట్ డిమాండ్ చేసింది. శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా అసోసియేషన్ యూనిట్ స్టేట్ కౌన్సిలర్ బి.విష్ణుమూర్తి అధ్యక్షతన జిల్లా సమావేశం జరిగింది. పెన్షనర్లకు నగదు రహిత వైద్యాన్ని అందించాలని ఆ ప్రతినిధులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇంటీరియల్ రిలీఫ్ 30 శాతం ప్రకటించాలని, మెడికల్ రీయంబర్స్‌మెంట్ నగదు పరిధి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు జి.అనంతం, కార్యదర్శి బి.చంద్రరావు, అసోసియేషన్ ప్రతినిధులు వనుము సోమశేఖరరావు, ఎస్‌వీ సత్యనారాయణరెడ్డి, టీవీఎస్ పద్మనాభం, కె.సత్యనారాయణ, రామచంద్రరావు, శ్యామ్‌బాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలు..
విజ్ఞాన దేవాలయాలు
అమలాపురం టౌన్: గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే దేవాలయాలని డీఈఓ డాక్టర్ ఎస్‌కే మెహబూబ్ బాషా అన్నారు. అమలాపురం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథౠలయ వారోత్సవాలు, బాలల దినోత్సవాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయాధికారి జీవీఆర్‌స్‌హెచ్‌కే వర్మ అధ్యక్షతన సభ జరిగింది. తొలుత సరస్వతీదేవి, పండిట్ జవహర్ నెహ్రూ చిత్రపటాలకు పూల మాలలు వేశారు. నేటి విద్యార్థులు గ్రంథాలయాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సూచించారు. ఉపాధ్యాయులు జి.శ్రీదేవి, బీఎన్ వెంకటేశ్వరరావు, టి.కుమార్ మణికంఠ, పి.మోహననావు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి
అమలు చేయాలి
అమలాపురం రూరల్: తొలి విడతలో పంచాయతీ ఎన్నికల్లో ప్రవర్తన నియమావళి కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ ఆఫీసర్, డీఆర్‌డీఏ పీడీ దుడ్డి రాంబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 19 మండలాల్లో ఎన్నికల అధికారులకు అమలాపురం కలెక్టరేట్‌లో గోదావరి భవనంలో శనివారం రాత్రి శిక్షణ తరగతులు నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్, ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్‌లో 150 మందికి శిక్షణ ఇచ్చారు. రాంబాబు మాట్లాడుతూ రూ.10 వేలకు మించి వస్తువులు, రూ.50 వేలకు మించి నగదు రవాణా చేస్తే చెక్ పోస్టుల్లో కచ్చితంగా తనిఖీ చేయాలన్నారు. మద్యం, బహుమతులు ఏదైనా భారీ స్థాయిలో రవాణా చేస్తే సంబంధిత రికార్డుల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


