ఎటపాక: గౌరీదేవిపేట గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గోదావరి నది పరీవాహక ప్రాంతమైన ఇక్కడ ఎక్కువ మంది రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. మిర్చి తోటలకు తడులు అందించేందుకు ఈ నెల ప్రారంభంలో గోదావరి ఒడ్డున విద్యుత్ మోటార్లు అమర్చారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం గోదావరి వద్దకు వెళ్లిన దారా రమేష్, మల్లె రాంబాబు, పోలిన రామకృష్ణ అనే చెందిన ముగ్గురు రైతులు తమ మోటార్లు లేకపోవడాన్ని గమనించారు. వెంటనే ఈ ఘటనపై ఎటపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన మోటార్లు, వైర్ల విలువ సుమారూ రూ.1.50 లక్షలు ఉంటుందని రైతులు తెలిపారు. కాగా.. మోటార్లు చోరీకి గురి కావడంతో పొలాలకు నీరు పెట్టేందుకు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో తడులు పెట్టకపోతే మిర్చి, పొగాకు తోటలు పాడవుతాయని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది గౌరీదేవిపేట, తోటపల్లి, నెల్లిపాక, చోడవరం ప్రాంతాల్లోని గోదావరి తీరంలో ఉన్న పదుల సంఖ్యలో మోటార్ల కాపర్ వైర్లను దొంగలు చోరీ చేశారు. ఈ ఏడాది మళ్లీ చోరీ ఘటనలు జరగడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు.


