రత్నగిరిపై భక్తుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై భక్తుల ఆందోళన

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

ఫ వసతి గదుల కోసం గందరగోళం

ఫ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో సమస్య

అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని గదుల రిజర్వేషన్‌ కార్యాలయం (సీఆర్వో) వద్ద శనివారం సాయంత్రం తీవ్ర గందరగోళం ఏర్పడింది. రత్నగిరికి విచ్చేసిన భక్తులు వసతి గదుల కోసం సీఆర్వో కార్యాలయం వద్దకు వచ్చారు. అదే సమయంలో సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ పేరుతో గంటసేపు కంప్యూటర్లు నిలిచిపోయాయి. వసతి గదులు ఖాళీ లేవని అక్కడి అధికారులు తెలపడంతో భక్తులు వాగ్వాదానికి దిగారు. తాము గతంలోనే రిజర్వ్‌ చేసుకున్నామని, ఇప్పుడు లేవంటే ఎలా ప్రశ్నించారు. అదే సమయంలో గదులు ఖాళీ చేసిన మరి కొందరు భక్తులు తమ అడ్వాన్స్‌ తీసుకోవడానికి వచ్చారు. వారికి కూడా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కారణంగా గంట వరకు అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వడం కుదరదని ఆలయ సిబ్బంది చెప్పడంతో వారు కూడా ఆందోళనకు దిగారు. అన్నవరం దేవస్థానంలోని ఎనిమిది సత్రాలలో ఏసీ, నాన్‌ఏసీ గదులు మొత్తం 5,22 ఖాళీ లేవని ఎలక్ట్రానిక్‌ బోర్డు లో డిస్‌ప్లే అవుతుండడంతో భక్తులు మరింత ఆందోళన చెందారు. కొందరు నేరుగా ఈఓ నల్లం సూర్యచక్రధరరావుకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ఆయన సర్దిచెప్పినా శాంతించలేదు. అనంతరం గంట తర్వాత ముందుగా బుక్‌ చేసుకున్న భక్తులకు గదులు ఇచ్చారు. మరి కొందరిని డార్మెటరీలకు పంపించారు. కాగా.. వసతి గదుల కోసం కూటమి నాయకులు, వివిద శాఖల ఉన్నతాధికారులు నుంచి సిఫారసు లేఖలు ఎక్కువగా వస్తుండడంతో అధికారులు సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. రిజర్వేషన్‌ చేయించుకున్న భక్తులకు గదులు ఇచ్చిన తర్వాత శనివారం సాయంత్రం 48 గదులు మాత్రమే మిగలగా వాటి కోసం 70 లేఖలు రావడం గమనార్హం.

పోటెత్తిన భక్తులు

సత్యదేవుని ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 4,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు సర్క్యులర్‌ మండపం వద్ద పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్‌, ఈవో ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆదివారం సెలవు దినం, సోమవారం తొలి కార్తిక సోమవారం కావడంతో రత్నగిరికి భక్తుల తాకిడి కొనసాగనుంది. ఈ రెండ్రోజులు స్వామివారి ఆలయాన్ని తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. స్వామివారి వ్రతాలు కూడా తెల్లవారుజామున రెండు గంటల నుంచి నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement