దంచికొట్టి.. ముంచెత్తి.. | - | Sakshi
Sakshi News home page

దంచికొట్టి.. ముంచెత్తి..

Sep 25 2026 12:53 AM | Updated on Sep 25 2026 12:53 AM

మడికి నుంచి దుళ్ల వెళ్ళే రోడ్డులో

విద్యుత్‌ తీగలపై పడిన భారీ వక్షం

వాయంగుండం కారణంగా కురిసిన వర్షాలకు

అయినవిల్లిలో కొబ్బరితోటల్లోకి చేరిన నీరు

అమలాపురం పట్టణం విద్యుత్‌ నగర్‌ రోడ్లు

ముంపునకు గురైన దృశ్యం

సాక్షి, అమలాపురం: ముఖం వాచేలా ఎదురుచూసినా రాని వర్షం.. గడచిన రెండు రోజులుగా బెంబేలెత్తించేలా కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘ఆర్నాబ్‌’ ప్రభావంతో కోనసీమ జిల్లా రెండో రోజూ తడిసిముద్దయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు తెరపనేది లేనట్టుగా కురుస్తున్న వర్షంతో పల్లెలు, పట్టణాలు జలమయమయ్యాయి. ఎల్‌ నినో తర్వాత కరువుతీరా వర్షం కురిసిందని రైతులు సంబరపడేలోపే, రెండో రోజు కురిసిన కుండపోత వర్షం అన్నదాత గుండెల్లో గుబులు రేపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రెండో రోజు కూడా తెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో 24 గంటల్లో సగటున 125.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తపేట మండలంలో 172.6 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా రాజోలు మండలంలో 81 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

లోతట్టు ప్రాంతాలు జలమయం

వర్షాలకు జిల్లా కేంద్రమైన అమలాపురంతో పాటు రామచంద్రపురం మున్సిపాలిటీ, ముమ్మిడివరం నగర పంచాయతీలలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, డ్రైన్లు ఏకమవ్వడంతో నీరు దిగే పరిస్థితి లేకుండా పోయింది. అమలాపురంలో గరిగుండ చెరువు, అశోక్‌నగర్‌, సావరం వంటి ప్రాంతాల్లో మోకాలు లోతున నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు, స్థానికులు ఇక్కట్ల పాలయ్యారు. ఈదురుగాలులకు కొన్నిచోట్ల భారీగా చెట్లు విరిగి పడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు సురాయిచెరువులు, కొత్తలంక, కాట్రేనికోన మండలాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు పెదపూడి మండలంలో భారీ నష్టం చోటుచేసుకుంది. కరకుదురు, చింతపల్లి, పెదపూడి, పెద్దాడ, జి.మామిడిడ తదితర గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. 14 విద్యుత్‌ స్తంభాలు, 10 చెట్లు, ఒక ఇల్లు కూలిపోయాయి. ఇల్లు కూలిన ఘటన సంపర గ్రామంలో జరిగింది. బుధవారం అర్ధరాత్రి వీచిన ఈదురు గాలులకు, భారీ వర్షానికి నందంపూడిలో పశువుల పాక కూలిపోయి రెండు పాడె గేదెలు మృతి చెందాయి. మరో రెండు పశువులు తీవ్ర గాయాలతో బయటపడ్డాయి. ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలిపోయి విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో విద్యుత్‌ స్తంభం ఒరిగిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం ప్రమాదం తప్పింది.

జనజీవనం అస్తవ్యస్తం

గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయి. తోపుడు బండ్లు, రోడ్ల వెంబడి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. వరుసగా రెండో రోజు కూడా వ్యాపారం లేకుండా పోయింది.

అన్నదాతల్లో గుబులు

వాయుగండం అన్నదాతను ఆందోళనలోకి నెట్టివేసింది. అమలాపురం మండలం నల్లమిల్లి, జనుపల్లి, అల్లవరం మండలం దేవగుప్తం, దేవగుప్తం రావుపాలెం వంటి ప్రాంతాల్లో వరిచేలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. కాట్రేనికోన, ముమ్మిడివరం, మలికిపురం, ఐ.పోలవరం తదితర మండలాల్లో సైతం వర్షం వల్ల చేలు మంపుబారిన పడ్డాయి. అమలాపురం నియోజకవర్గం పరిధిలో వాసాలతిప్ప, కూనవరం, ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో అయినాపురం, నార్త్‌ అడ్డాల్‌, రాజోలు దీవిలో శంకరగుప్తం డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. కోనసీమ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ ఆలస్యమైంది. చేలు పొట్టపోసుకునే దశలో ఉన్నాయి. ఈ కారణంగా ముంపుబారిన పడినా పెద్దగా నష్టం ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు కొనసాగితే తీర ప్రాంత మండలాల్లోని వరిచేలల్లో మరింత ముంపు పెరిగే అవకాశముంది.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

తీవ్ర వాయుగండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ : 08856 293104

మండలం కురిసిన వర్షం

(మి.మీటర్లలో)

కొత్తపేట – 172.6

కాట్రేనికోన – 153.6

ఆత్రేయపురం – 153.4

రామచంద్రపురం – 152.6

రావులపాలెం – 152.4

ఉప్పలగుప్తం – 149.6

ముమ్మిడివరం – 148.2

అయినవిల్లి – 144.6

ఐ.పోలవరం – 134.4

అమలాపురం – 127.0

కె.గంగవరం – 119.4

అంబాజీపేట – 119.0

అల్లవరం – 107.0

ఆలమూరు – 106.8

సఖినేటిపల్లి – 102.2

మామిడికుదురు – 91.0

పి.గన్నవరం – 87.2

మలికిపురం – 84.0

రాజోలు – 81.0

వాయుగుండం ప్రభావంతో

రెండోరోజూ భారీ వర్షాలు

స్తంభించిన జనజీవనం

నీట మునిగిన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు

ముంపుబారిన పంట పొలాలు

పొంగి ప్రవహిస్తున్న

పంట కాలువలు, డ్రెయిన్లు

కూలిన భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement