రోడ్డు బండారం బట్టబయలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు బండారం బట్టబయలు

Sep 25 2026 12:53 AM | Updated on Sep 25 2026 12:53 AM

సాక్షి, అమలాపురం: ప్రజా ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి ఈ రెండు రోడ్లు ఒక ఉదాహరణ. నిర్మించి రెండు, మూడు నెలలు కాకుండానే ఈ రోడ్ల నాణ్యత బట్టబయలైంది. ఈ ఏడాది భారీ వర్షాలు లేక ఇన్ని రోజులూ బయటపడని రోడ్ల నాణ్యత తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కేవలం రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో వీటి డొల్లతనం బయటపడింది. అమలాపురం మండలం ఈదరపల్లి నుంచి ఇందుపల్లి వరకు (ఎన్‌కౌంటర్‌ వంతెన మీదుగా) నిర్మించిన రహదారి రెండుగా విడిపోయింది. ఈ రహదారిని సుమారు రూ.1.50 కోట్లతో గత వేసవిలో నిర్మించారు. అంతకుముందు ఇక్కడ గ్రావెల్‌ రోడ్డు ఉండేది. స్థానికేతరుడైన ఒక కూటమి ప్రజాప్రతినిధికి చెందిన వ్యాపార ప్రయోజనాల కోసం భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా గత వేసవిలో ఈ రహదారిని ఆఘమేఘాల మీద నిర్మించారు. అమలాపురం నియోజకవర్గంలో పలు రహదారులు అధ్వానంగా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నాయకుని ప్రయోజనాల కోసం రోడ్డు నిర్మాణం వేగంగా పూర్తి చేశారు. కౌశికను ఆనుకుని నిర్మించిన ఈ రోడ్డు కృంగిపోకుండా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టారు. అయినా కూడా రోడ్డు రెండుగా చీలిపోయింది. 200 అడుగుల మేర.. అడుగు వెడల్పున రోడ్డు రెండుగా చీలిపోవడం గమనార్హం. నిర్మాణం లోపభూయిష్టంగా సాగిందనే విషయాన్ని ఇది తేటతెల్లం చేసింది. దీనికితోడు రోడ్డు దిగువన పాత భవనాలకు చెందిన ఇటుకు బొంత, ఇతర సిమెంట్‌ రద్దు వేసి దాని మీద గ్రావెల్‌, బీటీ వేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై పంచాయతీరాజ్‌ అధికారులు నోరుమెదపడం లేదు.

ఈదరపల్లి – ముక్కామల రోడ్డు సైతం..

అమలాపురం రూరల్‌: ఈదరపల్లి – ముక్కామల మధ్య బైపాస్‌ రోడ్డు అవినీతి బీటలు తీసింది. ఆధునీకరించిన నెల రోజులకే ఈ రోడ్డు కుంగిపోయిన విషయాన్ని సాక్షి ‘బైపాస్‌ రోడ్డుకు అవినీతి బీటలు’ అనే శీర్షికన వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణం చేసిన చోట రోడ్డు కుంగిపోవడం విడ్డూరం. నెల రోజుల పాటు కాలువకు నీరు నిలిపి.. ఆయకట్టును ఎండబెట్టి మరీ నిర్మించిన రోడ్డు రెండు నెలలకే కుంగిపోయింది.

రిటైనింగ్‌ వాల్‌ నిర్మించిన చోటే కుంగిపోయిన ముక్కామల – ఈదరపల్లి బైపాస్‌ రోడ్డు

కూటమి పాలనలో అవినీతికి ఈ రోడ్లే తార్కాణం – డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌

కూటమి నేతల అవినీతి, అక్రమాలకు ఈ రెండు రోడ్ల డొల్లతనమే ఒక మచ్చుతునక అని వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ విమర్శించారు. రోడ్లు కుంగిపోవడంపై ఆయన స్పందిస్తూ.. రెండు నెలల వ్యవధిలోనే ముక్కామల–ఈదరపల్లి బైపాస్‌ రోడ్డు కుంగిపోవడం దారుణమన్నారు. ఈ రోడ్డును సకాలంలో పూర్తిచేయకపోవడం వల్ల రైతులు నష్టపోవడంతో పాటు ప్రమాదం జరిగి ఇద్దరు మృత్యువాత పడ్డారని ఆయన గుర్తు చేశారు. ఇక ఈదరపల్లి– ఇందుపల్లి రోడ్డు రెండుగా విడిపోవడం చూస్తుంటే అమలాపురం నియోజకవర్గంలోనూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలనలో నిర్మిస్తున్న రహదారుల్లో నాణ్యత ఏపాటిదో అర్థమవుతోందన్నారు. నిత్యం నీతి, నిజాయతీల గురించి మాట్లాడే కూటమి నేతలు ఈ రోడ్ల డొల్లతనం మీద స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఎస్‌.యానాంలో జరిగే సంక్రాంతి సంబరాలకు విదేశీయులను తీసుకువస్తానని, ఈ ప్రాంత అందాలను చూపుతానని గొప్పగా చెబుతున్నారని, వారికి నాణ్యత లేక రెండుగా విడిపోతున్న రోడ్లను కూడా చూపించాలని శ్రీకాంత్‌ ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement