అంబాజీపేట/ పి.గన్నవరం: నేను వినను.. పట్టించుకోను.. అన్నట్టు ఎన్నికల కౌంటింగ్ వేళ ఆ ప్రజాప్రనిధి వ్యవహరించడం వివాదానికి దారితీసింది. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట వీజీవీ కౌంటింగ్ కేంద్రానికి పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పలుమార్లు రావడం, ఎవరూ పట్టించుకోకపోవడం ఘర్షణ వాతావరణానికి కారణమైంది. ఎమ్మెల్యే ఉదయం రెండు గంటల సేపు ఆ కేంద్రంలోని కూర్చోవడం పట్ల వైఎస్సార్ సీపీ నేతలతో పాటు పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను తక్షణమే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసులు ఖాతరు చేయలేదు. దాంతో కౌంటింగ్ కేంద్రం గేటు వద్ద వైఎస్సార్ సీపీ ఆందోళనకు దిగింది. దీంతో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యేకు పరిస్థితిని వివరించి ఆయనను బయటకు పంపించారు. దానితో వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన విరమించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్న సమయంలో గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ మళ్లీ కేంద్రానికి చేరుకుని, అక్కడున్న పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ పీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు కౌంటింగ్ కేంద్రం గేటు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. చీటికీమాటికీ ఎమ్మెల్యే ఎందుకు వస్తున్నారని, తన సోదరుడు ముంగండ–1 స్థానం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో ఆయనను గెలిపించుకునేందుకే వచ్చారా అంటూ అక్కడున్న పి.గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.భీమరాజును నిలదీశారు. దాంతో ఎమ్మెల్యే ఎప్పుడైనా వస్తారు.. ఎలాగైనా వస్తారు.. మీరు కూడా లోపలకు రావాలంటే ఎన్నికల అధికారి పర్మిషన్ తీసుకురండి అంటూ శ్రీనివాసరావుకు సీఐ సూచించారు. ఒక ఎమ్మెల్యే అయ్యిండి.. ఎన్నికల నియమావళిని పాటించకుండా ఇష్టానుసారం కౌంటింగ్ కేంద్రానికి రావడం సమంజసం కాదని, తక్షణమే బయటకు పంపించాలని శ్రీనివాసరావు విన్నవించారు. అయినప్పటికీ పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణ చేసిందే తప్ప పట్టించుకోలేదు. దీంతో కౌంటింగ్ కేంద్రం గేటు వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు బైఠాయించి సుమారు గంట సేపు నిరసన తెలిపారు. మరోపక్క ప్రధాన గేటు వద్దకు ఎమ్మెల్యేకు అనుకూలంగా అనుచరులు వచ్చారు. దాంతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సమయంలో కూటమి నాయకులు ఘర్షణకు సిద్ధమయ్యారు. దాంతో కొత్తపేట డీఎస్పీ ఇరువురిని వారించి ఎమ్మెల్యేను కేంద్రం వద్ద నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. ఈ సమయంలో వైఎస్సార్ సీపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. చివరికి ఎమ్మెల్యే కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన విరమించారు.
ఉత్కంఠ వీడింది
సాక్షి, అమలాపురం: ఉత్కంఠ వీడింది.. జిల్లాలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం తేలింది. శనివారం కౌంటింగ్ పూర్తి కావడంతో పీఠాలు ఎవరివో తేలిపోయింది. జిల్లాలో 10,90,975 మంది ఓటర్లకు గాను సుమారు 7.23 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 66.27 శాతం పోలింగ్ జరిగింది. జిల్లాలో మొత్తం 379 ఎంపీటీసీ స్థానాలకు, 19 జెడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ పూర్తయ్యింది. అమలాపురంలోని ఎస్కేబీఆర్ కళాశాల, కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామచంద్రపురంలో ఎస్కేపీజీఎన్ జూనియర్ కళాశాలను కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయమే ఎన్నికల సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుని కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 19 జెడ్పీటీసీ స్థానాలతో పాటు జిల్లా పరిషత్, అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. మరోవైపు పలు మండలాల్లో ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గణనీయమైన విజయాలను సొంతం చేసుకుంది.
నిబంధనలు విస్మరించిన ఎమ్మెల్యే
కౌంటింగ్ కేంద్రంలోనే తిష్ట
నిరసిస్తూ వైఎస్సార్ సీపీ
నాయకుల రాస్తారోకో
పోలీసుల లాఠీచార్జితో ఉద్రిక్త పరిస్థితి


