కొత్తపేట: మూడంచెల భద్రతా నడుమ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టామని జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియాదేవి అన్నారు. శనివారం కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలన్నారు. అనధికార వ్యక్తులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించరాదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జేసీ వెంట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ సెంటర్లను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. ప్రతి కౌంటింగ్ హాలును సందర్శించి, పోలీసు బందోబస్తు తీరుతెన్నులను చూశారు. ఎస్పీ రాహుల్ మీనా మీడియాతో మాట్లాడుతూ ప్రతి కౌంటింగ్ సెంటర్కు ఒక డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్చార్జ్గా నియమించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను మళ్లించినట్టు తెలిపారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాపాగర్, ఎస్సై సురేంద్ర తదితరులు ఉన్నారు. అలాగే ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ మహేంద్ర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.


