అమలాపురం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అంబేడ్కర్ కోనసీమలో జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు శుక్రవారం కాంపెన్సేటరీ సెలవు ప్రకటించినట్టు డీఈవో మహబూబ్ బాషా తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉప విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సెలవును ఆమలు చేయాలని ఆయన సూచించారు.
వాడపల్లి వెంకన్న
ఆదాయం రూ.2.50 కోట్లు
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి 37 రోజుల హుండీల ఆదాయం రూ.2 కోట్ల 50 లక్షల 11 వేల 671 లభించినట్టు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆలయ ఆవరణలోని హుండీలను బుధవారం దేవదాయ శాఖ అధికారులు వి.సత్యనారాయణ, ఎస్‌టీపీటీ శ్రీనివాస్, దేవాలయాల ఈవోలు ఎస్.సత్య మహేంద్ర, వై.సత్యనారాయణ సమక్షంలో లెక్కించారు. ప్రధాన, విశ్వేశ్వర స్వామి హుండీలతో కలిపి రూ.2 కోట్ల 4 లక్షల 24 వేల 921, అన్నప్రసాద వితరణ ద్వారా రూ.45,86,750 లభించాయని చెప్పారు. 84 గ్రాముల బంగారం, 1.617 కిలోల వెండి, 13 దేశాలకు చెందిన 86 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు.
వీఆర్‌ఏల అర్ధనగ్న నిరసన
కొత్తపేట: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పలు డిమాండ్లతో చేపట్టిన నిరవధిక నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తపేట మండల వీఆర్‌ఏలు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఎనిమిది రోజుల పాటు స్థానిక పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద వివిధ రీతుల్లో నిరసన తెలియజేసిన వీఆర్‌ఏలు తొమ్మిదో రోజు అర్ధనగ్న ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక కాపు కళ్యాణ మండపం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ మండల అధ్యక్షుడు కే భీమశంకరం, ప్రధాన కార్యదర్శి పిల్లంగోరు బాలు, కోశాధికారి ఎస్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


