అమలాపురం రూరల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, రానున్న గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవిలతో కలసి ఆయన మాట్లాడారు. ప్రజల రక్షణ, భద్రతే ప్రధాన లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. గాలి వేగం గంటకు 30 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉండటంతో జిల్లాలో పెద్దగా నష్టం సంభవించలేదన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల్లో గోదావరిలో భారీగా వరద నీరు చేరే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 26 నాటికి సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి, సెప్టెంబర్ 27 నాటికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, పిడుగుపాటు హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘అవేర్’ యాప్‌ను ప్రజలంతా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. భారీ వర్షాల కారణంగా విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర అత్యవసర సమస్యలు ఏర్పడితే ప్రజలు జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ను 08856–293104 నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
వరద ముప్పుపై
అప్రమత్తతతో పనిచేయాలి
అమలాపురం రూరల్: ప్రస్తుత భారీ వర్షాలతో గోదావరి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితులు, పింఛన్ దరఖాస్తుల పరిశీలన, పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు, ఎలక్టోరల్ రోల్ పరిశీలన తదితర అంశాలపై ఆర్‌డీవోలు, డీఎస్పీలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఎలక్టోరల్ రోల్ సవరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా చెప్పారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవులు ప్రకటించాలని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటి సమీపంలోకి విద్యార్థులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విలేకరుల సమావేశంలో కలెక్టర్, ఎస్పీ


