వీఆర్‌ఏల వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల వినూత్న నిరసన

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

వానలో తడుస్తూ జలదీక్ష

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

కొత్తపేట/అంబాజీపేట/పి.గన్నవరం/ఆలమూరు: పేస్కేల్‌ అమలు చేయాలని, నామినీలుగా పని చేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా నియమించాలనే పలు డిమాండ్లతో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) చేపట్టిన నిరవధిక సమ్మె ఎనిమిదో రోజుకు చేరింది. ఏడు రోజుల పాటు పలు రకాలుగా నిరసనలు తెలిపిన వారు బుధవారం వినూత్నంగా జలదీక్ష నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలో తడుస్తూనే వారు జలదీక్ష ద్వారా నిరసన తెలిపారు.

● కొత్తపేట మండల వీఆర్‌ఏలు స్థానిక పాత రామాలయం వీధి రోడ్డు చివరన బొబ్బర్లంక – ముక్తేశ్వరం కాలువలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం జిల్లా నాయకుడు పిల్లంగోరు బాలు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మందికి పైగా వీఆర్‌ఏలు పని చేస్తున్నారని, తమకు రూ.10,500 వేతనం మాత్రమే ఇస్తూండటంతో కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. విధుల్లో మరణించిన వారి కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, రీసర్వే, ఎన్నికల విధులు, భూమి శిస్తు వసూళ్లు, వాచ్‌మన్‌ విధులు తదితర అదనపు బాధ్యతల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు కె.భీమశంకరం, కోశాధికారి ఎస్‌.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

● అంబాజీపేట మండల వీఆర్‌ఏలు బీవీ సత్యనారాయణ, సీహెచ్‌ నాగేశ్వరరావు, జి.రామకృష్ణ, ఎం.భాస్కరరావులు మొసలపల్లి ప్రధాన పంట కాలువలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జీవితాల్లో ఎదుగుదల లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వీఆర్‌ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని, వీఆర్‌ఓ, అటెండర్‌, నైట్‌ వాచ్‌మన్‌ పదోన్నతి కోటాను 30 నుంచి 70 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు.

● పి.గన్నవరం మండలానికి చెందిన వీఆర్‌ఏలు వైనతేయ గోదావరి నదీపాయలో జలదీక్ష నిర్వహించారు. వీఆర్‌ఏల సంఘం కొత్తపేట డివిజన్‌ అధ్యక్షుడు గోగన్నమఠం ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడు కుంపట్ల రామకృష్ణ, మండల వీఆర్‌ఏల సంఘ అధ్యక్షుడు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు, కార్యదర్శి యార్లగడ్డ మహాలక్ష్మి, ఉపాధ్యక్షుడు పల్లేరు చిట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

● వీఆర్‌ఏల సంఘం ఆలమూరు మండల అధ్యక్షుడు తాతపూడి ఇస్సాక్‌ ఆధ్వర్యాన స్థానిక కోరంగి పెద్ద పంట కాలువలో వీఆర్‌ఏలు అర్ధనగ్నంగా జలదీక్ష చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పే స్కేల్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంఘం మండల కార్యదర్శి కె.శివరామారావు, ఉపాధ్యక్షుడు భువనగిరి ఏసు, సలహాదారు వి.నాగేశ్వరరావు తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement