నిర్మించిన నెల రోజులకే దిగిపోయిన ఈదరపల్లి – ముక్కామల రోడ్డు
అమలాపురం రూరల్: ఈదరపల్లి – ముక్కామల మధ్య బైపాస్ రోడ్డు అవినీతి బీటలు తీసింది. ఆధునికీకరించిన నెల రోజులకే ఈ రోడ్డు కుంగిపోయింది. జూలై నెలలో కోట్లాది రూపాయల ఖర్చుతో పంట కాలువ వైపు రక్షణ గోడ నిర్మించారు. పాలగుమ్మి, నడిపూడి, మొసలపల్లి, నేదునూరు, పెద్దపాలెం, ముక్కామల ప్రాంతాల్లో కాలువకు రివిట్‌మెంట్ నిర్మించారు. కొత్తగా బీటీ రోడ్డు వేశారు. అప్పట్లో నెల రోజుల పాటు పంట కాలవకు నీరు నిలిపి వేసి మరీ ఈ పనులు చేశారు. నీరు నిలిపివేయడంపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత కాంట్రాక్టర్‌పై మండిపడి, కేసు కూడా నమోదు చేయించారు. అనంతరం, గత ఆగస్టు నెలలో రోడ్డు పనులు మొక్కుబడిగా చేసి, మమ అనిపించారు. నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఈ రోడ్డు కుంగిపోయి ప్రమాదకరంగా తయారైంది. దీనిపై వాహనదారులు మండిపడుతున్నారు. తక్షణమే ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.


