● పలువురికి తీవ్ర గాయాలు ● గణేశ నిమజ్జనం ఊరేగింపులో ఘటన
అంబాజీపేట: గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా అంబాజీపేటలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గంగలకుర్రు గుంటమామిడి తోటకు చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన గణేశ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. అదే సమయంలో గుంటమామిడితోట నుంచి మరో సామాజిక వర్గం వారు రావులమ్మ ఆలయం మీదుగా ఊరేగింపుగా వెళ్తుతున్నారు. ఆ సమయంలో ఆలయం వద్ద గణపతి పూజలు నిర్వహిస్తున్న గంగలకుర్రు గుంటమామిడి తోటకు చెందిన వారు వైఎస్సార్ సీపీ జెండాలను చూసి అక్కడి నుంచి ఊరేగింపును ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో, ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారి తీసింది. దీంతో, ఓ సామాజిక వర్గానికి చెందిన నాగేశ్వరరావు, వాసు, హరికృష్ణ, ఆనంద్ శ్రీధర్, రాము, మణికుమార్, రమేష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు మరో సామాజిక వర్గానికి చెందిన నరసింహమూర్తి, లక్ష్మీనారాయణ, మల్లికార్జునరావు, వరప్రసాద్, సతీష్, బాలసుబ్రమణ్యాలకు కూడా తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు, అంబాజీపేట ఎస్సై షేక్ సుభానీ చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుభాని తెలిపారు.


