మలికిపురం: కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కలల వారధికి టెండర్ల ప్రక్రియ ముగిసినా, అనుమానాల నీలినీడలు మాత్రం వీడటం లేదు. వశిష్ట గోదావరి నదిపై సఖినేటిపల్లి – నర్సాపురం మధ్య వంతెన నిర్మించాలనేది శతాబ్దానికి పైబడిన స్వప్నం. ఇక్కడ వంతెన లేకపోవడంతో ప్రతి రోజూ సుమారు 20 వేల మంది ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో పడవలు, పంట్లపై గోదావరి దాటుతూ రాకపోకలు సాగిస్తున్నారు. పలువురు విద్యార్థులు సైతం తమ చదువుల కోసం రోజూ నర్సాపురం వెళ్లి వస్తూంటారు. ఇక్కడ వంతెన నిర్మిస్తే ఈ విద్యార్థులతో పాటు బాపట్ల జిల్లా రేపల్లె నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి, ఓడలరేవు, యానాం మీదుగా కాకినాడ వరకూ తీర ప్రాంత ప్రజలకు రాకపోకలు ఎంతో సులభతరమవుతాయి.
1910 నుంచే..
సఖినేటిపల్లి – నర్సాపురం వంతెన నిర్మాణానికి 1910లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రూ.70 వేలు మంజూరు చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1970లో అప్పటి కేంద్ర మంత్రి బ్రహ్మదత్, 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు మరోసారి శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ ఈ మూడు విడతల్లోనూ వంతెన నిర్మాణం సాకారం కాలేదు. 2004 ఎన్నికల్లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి పేరుతో శంకుస్థాపన చేశారు. అది కూడా మరుగున పడింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008లో ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ పలు విధానాల్లో వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేశారు. అంతలోనే వైఎస్ హఠాణ్మరణం చెందడంతో ఆయన రూపొందించిన కార్యాచరణను కొన్ని శక్తులు తరువాతి కాలంలో అడ్డుకున్నాయి.
జగన్ చొరవతో..
ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను గమనించిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2021లో ఈ వంతెన డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. 216 జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ.. వశిష్ట నదిపై అప్రోచ్‌కు ఇబ్బందులు లేకుండా సఖినేటిపల్లి – నర్సాపురం బదులు.. కాస్త దూరంగా రామేశ్వరం – రాజుల్లంక మధ్య కేంద్ర ప్రభుత్వం సహకారంతో రూ.400 కోట్ల అంచనాతో వంతెన మంజూరు చేయించారు. వంతెన, రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం తొలి విడతగా రూ.65 కోట్లు కూడా విడుదల చేశారు. ఉభయ జిల్లాల్లో 38 హెక్టార్ల భూమి సేకరించారు. నగదు చెల్లింపులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అయితే, గుడిమెళ్లంకలోని ప్రధాన పంట కాలువపై ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే చోటు మార్చాలంటూ కూటమి సానుభూతిపరులు కోర్టుకు వెళ్లారు. దీంతో, అప్పట్లో వైఎస్ జగన్ చేయాల్సిన భూమిపూజ రెండుసార్లు వాయిదా పడింది.
నిర్మాణం ఇలా..
మలికిపురం మండలం దిండి వద్ద జాతీయ రహదారి నుంచి బైపాస్ మార్గం ప్రారంభమవుతుంది. రామరాజులంక, పెదతిప్ప, గుడిమెళ్లంక, మలికిపురం, సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం అంతర్వేదిపాలెం, సఖినేటిపల్లి, రామేశ్వరం మీదుగా గోదావరి నది దాటి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఈ రోడ్డు ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రాజుల్లంక, పీచుపాలెం మీదుగా సీతారామపురం వద్ద జాతీయ రహదారి 216కు అనుసంధానంమయ్యేలా ఈ వంతెన, రోడ్డు డిజైన్ రూపొందించారు. మొత్తం రోడ్డు పొడవు 23.2 కిలోమీటర్లు కాగా ఇందులో రాజుల్లంక – రామేశ్వరం మధ్య గోదావరి నదిపై 1,100 మీటర్ల మేర వంతెన నిర్మిస్తారు.
అంచనాలు రూ.600 కోట్లకు..
ఈ ప్రాజెక్టు తాజా అంచనాలు సుమారు రూ.600 కోట్లకు చేరాయి. ఈ వంతెన, రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. స్కైలార్ ఇన్‌ఫ్రా రూ.334 కోట్లకు, వల్లభనేని కన్‌స్ట్రక్షన్ రూ.576 కోట్లకు, నితిన్ సాయి కన్‌స్ట్రక్షన్స్ రూ.507 కోట్లకు, రాజస్థాన్‌కు చెందిన బీఆర్‌కే సంస్థ రూ.299 కోట్లకు టెండర్లు దాఖలు చేశాయి. నిబంధనల ప్రకారం అతి తక్కువగా రూ.299 కోట్లకు టెండర్ వేసిన బీఆర్‌కే సంస్థకు టెండరు ఖరారైంది. దీనికి సంబంధించిన తుది ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
ఫ సఖినేటిపల్లి – నర్సాపురం
వంతెనకు టెండరు ఖరారు
ఫ అంచనా సుమారు రూ.600 కోట్లు
ఫ రూ.299 కోట్లకే
దక్కించుకున్న రాజస్థాన్ సంస్థ
ఫ వ్యయం సగానికి సగం కుదింపు
ఫ ఇంత తక్కువ సొమ్ముతో బైపాస్
కం వంతెన పనులు సాధ్యమేనా!
ఫ నిర్మాణంపై ఎన్నో సందేహాలు
ఆచరణ సాధ్యమేనా?
సాధారణంగా అధికారులు రూపొందించిన అంచనాల కంటే తక్కువకే నిర్మాణ సంస్థలు టెండర్లు దాఖలు చేస్తూంటాయి. ఆధునిక యంత్రాలను ఉపయోగించడంతో పాటు నిర్మాణంలో తక్కువ ఖర్చయ్యే పద్ధతులు అవలంబిస్తాయి. అలాగే, అంచనాల్లోని అనవసరపు ఖర్చులను తగ్గిస్తాయి. తద్వారా తాము పేర్కొన్న వ్యయానికే ఆయా నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేందుకు ఆయా సంస్థలు ప్రణాళికలు రూపొందించుకుంటాయి. అయితే, వ్యయాన్ని ఎంతగా నియంత్రించినప్పటికీ వశిష్ట గోదావరిపై వంతెన, రోడ్డు నిర్మాణాన్ని రూ.299 కోట్లతో పూర్తి చేయడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికి వారు అనేక కారణాలు చెబుతున్నారు.
ఫ ఈ ప్రాంతంలో నేల దృఢత్వం తక్కువ. లూజ్ సాయిల్ (మెత్తటి నేల) ఉండటంతో ఇక్కడ గట్టి నేల లేదా రాతిపొరలు చాలా లోతులో ఉంటాయి. అందువలన పిల్లర్ల పునాదులను 30 నుంచి 50 మీటర్ల లోతు నుంచి నిర్మించాల్సి ఉంటుంది. దీనికి భారీగా ఐరన్, కాంక్రీట్ అవసరమవుతాయి.
ఫ గోదావరి వరదల సమయంలో నదిలోని ఇసుక కొట్టుకుపోతుంది. ఈ ఇసుక కోత వలన వంతెన పునాదులు దెబ్బ తినకుండా ఉండాలంటే సాధారణం కంటే మరింత లోతుగా, బలంగా పిల్లర్లు వేయాల్సి ఉంటుంది.
ఫ వంతెనకు ఇరువైపులా నిర్మించే అప్రోచ్ రోడ్ల నిర్మాణంలో నేలను గట్టి పరచడానికి జాతీయ రహదారుల సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక సాంకేతికతను వినియోగించాలి.
ఫ మెత్తటి నేలలు, నీటిలో పనులు చేయడానికి భారీ హైడ్రాలిక్ రిగ్స్, క్రేన్లు అవసరమవుతాయి. వీటి నిర్వహణ ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి.
ఫ ఇటువంటి సవాళ్ల నడుమ కేవలం రూ.299 కోట్లతో ఈ వంతెన, రోడ్డు నిర్మాణం సాధ్యం కాకపోవచ్చని స్వయంగా కొంత మంది అధికారులే అంటున్నారు.
ఫ దీనిపై ఉన్నతాధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


