రాజానగరం: తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలు భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ఈడీ కూడా నిర్ధరించిన నేపథ్యంలో.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం రావుల చెరువు గట్టున కొలువు దీరిన వేంకటేశ్వర స్వామి వారిని పార్టీ నాయకులతో కలసి ఆమె మంగళవారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. గుడి మెట్లను నీటితో కడిగి, పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, కోట్లాది మంది భక్తుల మనోభావాలు తినేలా, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ఆడిన లడ్డూ డ్రామాపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని అన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని 2024లో ఈ పెద్దలు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టిందన్నారు. తాజాగా వెలువడిన ఈడీ దర్యాప్తులో కూడా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదనే విషయం స్పష్టమైందని అన్నారు. రాజకీయ స్వార్థం కోసం స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబు వివాదంలోకి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్
సమాధానం చెప్పాలి
వైఎస్సార్ సీపీ నాయకురాలు
జక్కంపూడి విజయలక్ష్మి
రాజానగరం వేంకటేశ్వరస్వామి
ఆలయంలో పూజలు


