సాక్షి, అమలాపురం: ఒకటి కాదు.. రెండు కాదు.. పాతికేళ్లు దాటింది. కోనసీమ రైల్వే ప్రాజెక్టుకు పనులు ప్రారంభించి రజతోత్సవమవుతోంది. శంకుస్థాపన నాటి ఆశలు ఇప్పటికీ సాకారం కాలేదు. కోనసీమకు రైలు వస్తుందన్న కల ఇంకా పట్టాలకెక్కలేదు. అమలాపురం వేదికగా 2000 నవంబర్ 16న అప్పటి కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేశారు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు పూర్తయిన ఈ రైల్వే లైన్ అక్కడి నుంచి ముందుకు సాగడం లేదు. మొత్తం 57.21 కిలోమీటర్ల ఈ రైల్వే మార్గం కోనసీమను రైల్వే పటంలోకి తీసుకురావడంతో పాటు వరి, కొబ్బరి, అరటి, ఆక్వా తదితర వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా కీలకంగా మారుతుందని స్థానికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
25 ఏళ్ల దాటినా అవే ఎదురు చూపులు
2000–01లో ప్రాజెక్టు రైల్వే బడ్జెట్‌లోకి వచ్చింది. తొలినాళ్లలో సుమారు రూ.329 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం కాలక్రమంలో భారీగా పెరిగి రూ.2120 కోట్లకు చేరింది. 2023 మార్చి నాటికి రైల్వే శాఖ రూ.1181 కోట్లు ఖర్చు చేసింది. అయినా రైలు పరుగులు పెట్టే పరిస్థితి రాలేదు. ప్రాజెక్టు జాప్యం కోనసీమలో అసంతృప్తికి ప్రధాన కారణంగా మారింది. నవంబరు నాటికి పాతకేళ్లవుతున్నా 2026లోనూ కోటిపల్లి–నరసాపురం కొత్త రైల్వే లైనన్ కొనసాగుతున్న ప్రాజెక్టుల జాబితాలోనే ఉండిపోయింది. మూడు వంతెనలకు సంబంధించి పిల్లర్లు మాత్రమే పూర్తయ్యాయి. వాటిపై గెడ్డర్ల నిర్మాణం జరగడం లేదు. గౌతమీ నదిపై గెడ్డర్ల నిర్మాణాలకు టెండర్లు ఖరారై మూడేళ్లు కావస్తున్నా పనులు మొదలు కాలేదు.
భూసేకరణే అతి పెద్ద సమస్య
కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్‌కు మొత్తం 421.35 హెక్టార్ల భూమి అవసరమని 2024లో కేంద్రం తెలిపింది. అందులో అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం 162.52 హెక్టార్లను మాత్రమే రైల్వేకు అప్పగించింది. మిగిలిన భూమి అందుబాటులోకి రాకపోవడంతో పనులు వేగంగా సాగలేదని కేంద్రం స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న భూముల్లో మాత్రం పనులు కొనసాగుతున్నాయని తెలిపింది. ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియలో కొంత పురోగతి వచ్చినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. అమలాపురం–గుడిమెల్లంక మధ్య అలైన్‌మెంట్ మార్పుపై 2024–25లో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలు, పరిహారం అంశాలు కూడా ప్రాజెక్టు వేగాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
గోదావరి పాయలపై..
మూడు భారీ వంతెనలు
కోనసీమ రైల్వే ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన భాగం గోదావరి పాయలపై వంతెనల నిర్మాణం. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ నదులపై భారీ రైల్వే వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ మూడు వంతెనల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నట్టు రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. గడచిన రెండున్నరేళ్లుగా కేవలం రెండు, మూడు పిల్లర్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరీ ముఖ్యంగా గడచిన ఏడాది కాలంగా దాదాపు పనులు నిలిచిపోయాయి. భూసేకరణ ఒకవైపు.. వంతెనల నిర్మాణం మరోవైపు.. పెరుగుతున్న నిర్మాణ వ్యయం ఇంకోవైపు.. ఇలా ప్రాజెక్టు ముందుకు సాగుతున్న ప్రతి దశలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
నిరసన తెలిపినా
బాబు నుంచి స్పందన లేదు
ఇటీవల భూసేకరణకు నిధులు, పరిహారం, పనుల వేగవంతంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు నిరసనలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల తొమ్మిదిన అంబాజీపేట పర్యటనకు వచ్చిన నేపథ్యంలో కోనసీమ రైల్వేలైన్ అంశం చర్చనీయాంశమైంది. ప్రాజెక్టుకు భూసేకరణ సమస్య పరిష్కారం, రాష్ట్ర వాటా నిధుల విడుదల, కేంద్రంతో సమన్వయం వంటి అంశాలపై స్పష్టత వస్తుందని ప్రజా సంఘాలు ఆశించాయి. పర్యటనలో ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు నుంచి నిర్దిష్టమైన హామీ రాకపోవడం గమనార్హం. కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. వచ్చే రెండున్నరేళ్లలోనూ ఈ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
జగన్ హయాంలో రూ.50 కోట్ల కేటాయింపులు..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2023లో భూసేకరణకు రూ.50 కోట్ల కేటాయింపులు చేశారు. ప్రభుత్వం మారిన తరువాత భూ సేకరణ వివాదాలుగా మారింది. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం కూడా ఒక కారణం. మరోవైపు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోనసీమ జేఏసీ, రైల్వే సాధన సమితి తదితర ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.
హామీలు గాలికొదిలేశారు..
చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులు ప్రాజెక్టు పూర్తి చేస్తామని గతంలో హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ హామీలు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని కోనసీమ ప్రజలు కోరుతున్నారు. రైల్వే ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి రాష్ట్ర వాటా బకాయిలు, భూమి అప్పగింతలో జాప్యమే కారణమని కేంద్రం చెబుతోంది.


