దక్షిణ కోస్తా రైల్వే చొరవతో
తొలిసారిగా మహారాష్ట్రకు
కాకినాడ రూరల్: కలప గుజ్జును రైలు మార్గంలో రవాణా చేసే కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే శ్రీకారం చుట్టింది. భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు ఒక సరుకుగా దీనిని లోడ్ చేసి రవాణాను శనివారం ప్రారంభించింది. రోడ్డు మార్గం నుంచి రైలు మార్గానికి విజయవంతంగా మళ్లించడం ద్వారా సరకు రవాణా ఆదాయానికి కొత్త వనరుకు తెరతీసింది. గత 15 ఏళ్లుగా కాకినాడ నుంచి మహారాష్ట్రలోని కాగితపు పరిశ్రమలకు దిగుమతి చేసుకున్న కలప గుజ్జును రోడ్డు మార్గం ద్వారానే రవాణా చేసేవారు. ఈ రవాణాను రైలు మార్గానికి మళ్లించే అవకాశాలను గుర్తించిన దక్షిణ కోస్తా రైల్వే, పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరిపి, వాస్తవ లోడింగ్ అవసరాలు, సుంకాల (టారిఫ్) విధానాన్ని పరిశీలించింది. వాస్తవానికి ఒక్కో వాగన్‌కు 45–50 టన్నుల కలప గుజ్జును మాత్రమే లోడ్ చేయగల సామర్థ్యం ఉంటుందని, అయితే రైల్వే వసూలు చేసే చార్జీల విధానం మాత్రం 65.1 టన్నుల సామర్థ్యం ఆధారంగా ఉండటం వల్ల రోడ్డు మార్గంతో పోలిస్తే రైలు రవాణా ఖరీదైనదిగా మారిందని గమనించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, దక్షిణ కోస్తా రైల్వే పరిశ్రమ వర్గాలతో చర్చలు జరిపి, కలప గుజ్జు రవాణాకు తగిన రేట్లను నిర్ణయించాలని ఈ ఏడాది జూలైలో రైల్వే బోర్డుకు ఒక ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదన మేరకు, సరకు రవాణా టారిఫ్‌లోని క్లాస్–110 కింద కలప గుజ్జును ఒక వస్తువుగా చేర్చారు. దీనివల్ల రవాణా చార్జీలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా రోడ్డు మార్గం కంటే రైలు మార్గం ద్వారా రవాణా చేయడం మరింత చౌకగా మారింది. దీంతో 1061 కిలోమీటర్ల మేర సాగే సుదూర రవాణా రోడ్డు మార్గం నుంచి రైలు మార్గానికి విజయవంతంగా మళ్లింది. దిగుమతి చేసుకున్న కలప గుజ్జును తీసుకెళ్తున్న మొట్టమొదటి ’బోస్ట్’ (రేక్) కాకినాడలో లోడ్ చేయడంతో మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు బయలుదేరింది.
రూ.20 కోట్ల వార్షిక ఆదాయం..
ఒక్కో రేక్ (గూడ్స్ రైలు) రవాణా ద్వారా దాదాపు రూ.40 లక్షల ఆదాయం సమకూరుతుంది. తద్వారా దక్షిణ కోస్తా రైల్వేకు సంవత్సరానికి సుమారు 1.5 లక్షల టన్నుల అదనపు లోడింగ్‌తో పాటు, అంచనా ప్రకారం దాదాపు రూ.20 కోట్ల వార్షిక సరకు రవాణా ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఈ రవాణా మార్గాన్ని గుర్తించి, అభివృద్ధి చేసి విజయవంతంగా మళ్ళించడంలో సమష్టిగా కృషి చేసిన ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ వినీత్ కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె.సాంబశివరావు, విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సోనకియాతో పాటు మొత్తం బృందాన్ని దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ అభినందించారు.


