కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదు? | - | Sakshi
Sakshi News home page

కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదు?

Sep 20 2026 12:09 AM | Updated on Sep 20 2026 12:09 AM

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు

చంద్రబాబు తీరుపై వైఎస్సార్‌సీపీ

జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి విమర్శలు

రావులపాలెం: రాష్ట్రంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రైతుల పక్షపాతినని చెప్పుకొనే చంద్రబాబు ఇప్పటివరకు కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం వర్షపాత లోటు ఉంటే, ఒక్క డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనే 57 శాతం లోటు నమోదైందన్నారు. ఈ పరిస్థితుల్లో పక్క ఉన్న కర్ణాటక వంటి రాష్ట్రాలు ఆగస్టు 28వ తేదీనే కరువు మండలాలను ప్రకటించాయన్నారు. కరువు ప్రకటన లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. కరువు మండలాలు ప్రకటిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, బ్యాంకుల రుణాలు రీషెడ్యూల్‌ అవుతాయని, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందని, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందుతుందని వివరించారు. ఇవేవీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడం లేదని విమర్శించారు. మోంథా తుపాను బకాయిలే రూ.800 కోట్లు ఉన్నాయని, కరువు ప్రకటిస్తే రూ.6 వేల కోట్లకు పైగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని చెప్పారు.

యూరియా కూడా ఇవ్వట్లేదు..

జిల్లాలో కనీసం యూరియా కూడా దొరకని పరిస్థితి ఉందని, రైతులు బ్లాక్‌ మార్కెట్‌లో ఎరువులు కొనుక్కోవాల్సి వస్తోందని జగ్గిరెడ్డి తెలిపారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ మంత్రి కొబ్బరి, కోకో, కంద వంటి పంటలకు కేజీ యూరియా కూడా ఇవ్వడం లేదన్నారు. క్యాబేజీకి 3 కేజీలు కావాల్సి ఉంటే అర కేజీ మాత్రమే ఇస్తున్నారన్నారు. మరోవైపు ఎరువుల ధరలను విపరీతంగా పెంచేశారన్నారు. దీనివల్ల ఎకరాకు రూ.10 వేలు అదనపు భారం పడుతుందని చెప్పారు. కాలువ చివరి భూములకు సాగునీరందడం లేదని తెలిపారు. టన్నుకు రూ.26 వేల వరకు మేత ధర పెంచి ఆక్వా రైతునూ కోలుకోలేని దెబ్బతీశారని విమర్శించారు. నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పారు. తక్షణమే రాష్ట్రంలో వర్షాభావ మండలాలను ’కరువు మండలాలు’గా ప్రకటించాలని వైఎస్సార్‌ సీపీ తరపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

అక్రమార్జనలో బిజీగా కూటమి నేతలు

నియోజకవర్గాల్లో బెల్ట్‌ షాపులు, లిక్కర్‌ కమీషన్ల ద్వారా వచ్చే లాభాలను పంచుకోవడంలోనే కూటమి నాయకులు బిజీగా ఉన్నారని, సందుసందునా బెల్ట్‌ షాపులు నడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మద్యంలో స్థానిక ఎమ్మెల్యే రూ.3 కోట్ల వరకు మామూళ్ళు తీసుకుని తమ్ముళ్ళకు నష్టాలను పంచారని వాళ్ళ నాయకులే చెబుతున్నారన్నారు. సమావేశంలో నేతలు కె.శ్రీనివాసరావు, జి.రమాదేవి, ఎం.గంగాధరరావు, బి.కరుణాకరం, టి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement