మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ
అమలాపురం టౌన్: నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాల సేకరణకు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనం పోలీసుల దర్యాప్తులో ఎంతో కీలకంగా ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. జిల్లాకు కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ వాహనం నేర స్థలానికి నేరుగా చేరుకుని అక్కడిక్కడే ఆధారాలను గుర్తించడం, సేకరించడం, భద్ర పరచడం, డాక్యుమెంటేషన్ చేయడం వంటి పనులు చేస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ వివరించారు. నేరస్తుల సాధారణ భౌతిక ఆధారాల సేకరణ, కంటికి కనిపించని ఆధారాలను గుర్తించేందుకు హై–ఇంటెన్సిటీ ఫోరెన్సిక్ లైట్ వంటి ఆధునాతన పరికరాలు ఈ వాహనంలో ఉన్నాయని తెలిపారు. ఈ వాహనంలో రక్తం, వీర్యం వంటి జీవ ఆధారాల ప్రాథమిక పరీక్ష, సేకరణ కిట్లు, డీఎస్‌ఏ నమూనా సేకరణ కిట్, మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాల స్క్రీనింగ్ కిట్లు, గన్ షాట్ రెసిడ్యూ సేకరణ కిట్, బుల్లెట్ హోల్ పరిశీలన కిట్, ట్రేస్ ఎవిడెన్స్ కోసం స్టీరియో మైక్రో స్కోప్, డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా, బాడీ–వార్న్ కెమెరా వంటి ఆధునాతన సదుపాయాలు ఉంటాయని ఆయన చెప్పారు. వాహనంలో జీపీఎస్, సీసీ టీవీ, డ్యాష్ బోర్డు కెమెరా, వెయింగ్ బ్యాలెన్స్, మినీ రిఫ్రిజేటర్, ఎల్‌ఈడీ స్క్రీన్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టం, బార్ కోడ్ స్కానర్, థర్మల్ ప్రింటర్, జనరేటర్ వంటి పరికరాలతో పాటు డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కిట్ సదుపాయం కూడా ఉంటుందని వివరించారు. పోలీసుల దర్యాప్తులో ఈ వాహనంలో ఉన్న సదుపాయాలు ఎంతో కీలకం కానున్నయని ఎస్పీ తెలిపారు. ఈ పరికరాలు సేకరించిన ఆధారాలు సంబంధిత కేసును దర్యాప్తు చేస్తున్న అధికారికి అందించి కోర్టుల్లో సునాయాసంగా అందజేసేలా ఉపయోగపడతాయని చెప్పారు. ఇద్దరు ఉద్యోగులు వాహనంలో ఉండి పరికరాలు ఆపరేట్ చేస్తారన్నారు. వాహనం ప్రారంభ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ సీఐ రాజేష్, ఏఆర్ ఆర్‌ఐ బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.


