బాబు, పవన్‌ భక్తులకు క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

బాబు, పవన్‌ భక్తులకు క్షమాపణ చెప్పాలి

Sep 20 2026 12:09 AM | Updated on Sep 20 2026 12:09 AM

మాజీ ఎంపీ అనురాధ డిమాండ్‌

అల్లవరం: తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు అవశేషాలూ లేవని ఈడీ నిర్ధారించిందని, ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ చింతా అనురాధ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తాజాగా వెలువడిన ఈడీ దర్యాప్తు వివరాలతో లడ్డు వ్యవహారానికి తెరపడిందని ఆమె తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్‌, కూటమి నేతలు.. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని విమర్శించారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయడం దారుణమని పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాలకు సంబంధించిన పవిత్రమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ఇకనైనా మానుకోవాలని కూటమి నేతలకు హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఎన్ని దుష్ప్రచారాలు చేసినా నిజం తేటతెల్లమైందని ఆమె తెలిపారు.

నాలుగో రోజుకు చేరిన

వీఆర్‌ఏల సమ్మె

పి.గన్నవరం: తమ డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ పి.గన్నవరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మె శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. నామినీలుగా పనిచేస్తున్నవారిని వీఆర్‌ఏలుగా నియమించాలని, అర్హత ఉన్న వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన కార్యక్రమంలో మండల వీఆర్‌ఏల సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు, యార్లగడ్డ మహాలక్ష్మి, గౌరవాధ్యక్షుడు చిలకపాటి చిన్నారావు, ఉపాధ్యక్షుడు పల్లేరు చిట్టి వెంకన్న, కుంపట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జూనియర్‌ సివిల్‌ జడ్జిల బదిలీలు

కాకినాడ లీగల్‌: పలువురు జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు కొత్త నియామకాలు, బదిలీలు చేస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా పుంగనూరు ఒకటో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న కె.కృష్ణవంశీని బదిలీపై కాకినాడ నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు. కర్నూలు జిల్లా ఆదోని రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆత్మకూరి వెంకట సాయి శ్రీవల్లిని బదిలీపై కాకినాడ ఒకటో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement