ఆలమూరు: కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులు, చేస్తున్న అక్రమ అరెస్టులతో వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బడుగువానిలంక, మూలస్థాన అగ్రహారం వంతెనల పేర్ల విషయమై ప్రశ్నించిన పార్టీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌పై కూటమి నేతలు అక్రమ కేసు నమోదు చేయించి, ఈ నెల 17న అరెస్టు చేయించిన విషయం తెలిసిందే.
ఆలమూరు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగ్గిరెడ్డి.. న్యాయ సలహాదారులను నియమించి, కోర్టులో న్యాయ పోరాటం చేశారు. ఈ పోరాటం ఫలించడంతో మూడు రోజుల్లోనే తమ్మనకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల కోరిక మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి భారీ కార్లు, బైక్ ర్యాలీ, బాణసంచా కాల్పుల నడుమ తమ్మనను గురువారం రాత్రి చెముడులంకలోని ఇంటికి తీసుకువచ్చారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ధర్మం గెలిచింది.. దుర్మార్గం ఓడిందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమ్మనను ఆయన కుటుంబ సభ్యులకు జగ్గిరెడ్డి అప్పగించారు.
కూటమి అరాచకాలపై
పోరాటం ఉధృతం
ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, జిల్లా, నియోజకవర్గవ్యాప్తంగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ, కూటమి నేతల అకృత్యాలు, అరాచకాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పార్టీ శ్రేణులందరూ ఐకమత్యంతో ఉండి, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
జగ్గిరెడ్డి వెన్నంటే ఉంటాం
వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ కష్టనష్టాలు ఎదురైనా, అన్యాయానికి గురైనా అన్నివిధాలా అండగా ఉంటున్న జగ్గిరెడ్డి వెన్నంటి జీవితాంతం ఉంటామని ఆ పార్టీ మండల నేతలు పేర్కొన్నారు. ఏ నేరం చేయకపోయినా పార్టీలో చురుగ్గా ఉంటున్నారనే కక్షతో తమ్మనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తాను అరెస్టయి, విడుదలయ్యేంత వరకూ వెన్నంటి ఉన్న జగ్గిరెడ్డికి, కార్యకర్తలకు, నాయకులకు తమ్మన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖుల పరామర్శ
ఇదిలా ఉండగా తమ్మన శ్రీనివాస్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద పలువురు ప్రముఖులు పరామర్శించారు. వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ చింతా అనురాధ, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కర్రి పాపారాయుడు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చిర్ల జగ్గిరెడ్డి
బెయిల్‌పై తమ్మన శ్రీనివాస్ విడుదల
భారీ ర్యాలీతో
పార్టీ శ్రేణుల ఘన స్వాగతం


