అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పురోగతిపై రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, అదనపు సీఈఓలు ఢిల్లీరావు, వెంకటేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో సర్ పనులు పూర్తయ్యాయని, పెండింగ్ పనులను త్వరతిగతిన పూర్తి చేసి, నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పద్ధెనిమిది సంవత్సరాల వయస్సు నిండిన యువతీయువకులు ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు, జిల్లా పరిపాలనాధికారి నాగలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
1న చలో విజయవాడ
అమలాపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీ సీపీఎస్ ఈఏ) ఆధ్వర్యాన వచ్చే నెల 1న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా జేఏసీ చైర్మన్ కోలా కృష్ణ తెలిపారు. దీనిని విజయవంతం చేయాలని జిల్లాలోని సంబంధిత ఉద్యోగులకు పిలుపునిచ్చారు. స్థానిక సబ్ ట్రెజరీ వద్ద చలో విజయవాడ పోస్టర్లను జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఓపీఎస్ (పాత పెన్షన్ విధానం) అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో వచ్చే నెల 1న చలో విజయవాడ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ మునేశ్వరరావు, ఏపీ సీపీఎస్ ఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకటేష్ గోపాలం, ఏపీ ఎన్‌జీఓల సంఘం జిల్లా కోశాధికారి గుర్రాల సురేష్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులు డి.రామకృష్ణ, డి.పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పశు జనరిక్ ఔషధ విక్రయ కేంద్రాలు
జిల్లాలో మూడుచోట్ల
ప్రయోగాత్మకంగా ఏర్పాటు
కొత్తపేట: అమలాపురం, రావులపాలెం, లక్కవరాల్లో పశు జనరిక్ ఔషధ విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బి.నాగేశ్వరరావు తెలిపారు. కొత్తపేట మండలం వాడపాలెం రైతు సేవా కేంద్రంలో ఆ శాఖ కొత్తపేట సబ్ డివిజన్ అధికారులు, సిబ్బందితో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పశు పోషకుల ఆధార్ అప్‌డేషన్, పశువుల టీకాల కార్యక్రమాలను నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో జీవీఏ, పోడెర్ అసెస్‌మెంట్ నివేదికలు అందుబాటులో ఉండాలన్నారు. దూడల జననాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అర్హత కలిగిన రైతులు పశుబీమా పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చైతన్యపరచాలన్నారు. అనంతరం నాగేశ్వరరావు విలేకర్లతో మాట్లాడుతూ, పశు పోషకులకు, రైతులకు తక్కువ ధరలోనే నాణ్యమైన జనరిక్ పశువైద్య మందులు, టీకాలు, పోషక సప్లిమెంట్లను సులభంగా అందించేందుకు పశు జనరిక్ ఔషధ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ మూడు కేంద్రాల్లో వచ్చే ఫలితాలను బట్టి ఈ షాపుల విస్తరణకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. వచ్చే నెల 15 నుంచి పశువులకు, జీవాలకు గాలింటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నామని ఆయన తెలిపారు. పశు సంవర్ధక శాఖ సబ్ డివిజన్ ఏడీ చీకట్ల వెంకట నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యాలయ ఏడీ చంద్రశేఖర్, వివిధ మండలాల పశు సంవర్ధక, వెటర్నరీ లైవ్‌స్టాక్ అధికారులు పాల్గొన్నారు.
25న జెడ్పీ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 25వ తేదీ ఉదయం 10.30 గంటలకు జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరగనుంది. ఈ విషయాన్ని జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


