● అరటి రైతుకు అరకొరగా యూరియా
● గతంలో ఎకరాకు ఖరీఫ్‌లో 3,
రబీలో 3 బస్తాలకు పరిమితి
● తాజాగా ఖరీఫ్‌లో ఒక బస్తా పెంపు
● కొబ్బరి, కోకో, వక్క వంటి పంటలకూ
పెంచాలని డిమాండ్
సాక్షి, అమలాపురం: ఉద్యాన పంటలకు అవసరానికి తగినట్లు కాకుండా ఏపీ ఏఐఎంఎస్ యాప్ ఆధారంగా యూరియా కేటాయించడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతూండటంతో ప్రభుత్వం తాజాగా బస్తాల సంఖ్యను కొంత పెంచింది. కొబ్బరి, అరటి, ఇరత ఉద్యాన పంటలకు శాస్త్రవేత్తల సిఫారసులకు అనుగుణంగా యూరియా సరఫరా చేయకపోవడంపై ‘యాప్‌సోపాలు’ శీర్షికన ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించింది. దీంతోపాటు కోనసీమ ఉద్యాన రైతుల యూరియా కష్టాలపై వరుస కథనాలు ప్రచురించడంతో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. తొలుత అరటికి ఏడాదికి 3 బస్తాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనిపై రైతులు, వివిధ వర్గాలు ఆందోళన చేయడంతో ఖరీఫ్‌లో 3, రబీలో 3 బస్తాలకు పెంచింది. అయినప్పటికీ రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూండటంతో తాజాగా దీనిని ఖరీఫ్‌లో 4 బస్తాలకు పెంచింది. రబీలో మాత్రం ఎటువంటి పెంపూ చేయలేదు. అంటే, ఒక్క యూరియా బస్తా మాత్రమే పెంచి, ఏడాదికి 7 బస్తాలకు పరిమితి పెట్టింది. డీఏపీని ఒక బస్తా నుంచి రెండుకు పెంచింది. అయితే, ఈ పెంపు కేవలం కంటితుడుపేనని, తమ వాస్తవ అవసరాలను తీర్చే స్థాయిలో లేదని ఉద్యాన రైతులు చెబుతున్నారు.
అవసరం కొండంత.. ఇస్తున్నది గోరంత
అరటి సాగుకు ఎకరాకు కనీసం 8 నుంచి 10 బస్తాల యూరియా అవసరమవుతుందని రైతులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ, శాస్త్రవేత్తల సిఫారసుల ప్రకారం ఒక్కో అరటి మొక్కకు సీజన్‌లో సుమారు 465 నుంచి 600 గ్రాముల వరకూ యూరియా అవసరం. అంతర పంటగా కాకుండా ఏకపంటగా సాగు చేసేచోట ఎకరాకు వెయ్యి నుంచి 1,200 మొక్కల వరకూ వేస్తారు. ఈ లెక్కన యూరియాను ఏడు బస్తాలకే పరిమితం చేయడం వలన మొక్కలకు అవసరమైన పోషకాలు అందడం లేదని రైతులు అంటున్నారు. మొక్కల సంఖ్యను బట్టి ఎకరాకు 8 నుంచి 13 బస్తాల వరకూ యూరియా అందించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈవిధంగా తమ అవసరం కొండంత ఉండగా.. గోరంత మాత్రమే యూరియా ఇవ్వడం వలన ప్రయోజనమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కొబ్బరి, అంతర పంటల మాటేమిటో!
కోనసీమలో అరటి మాత్రమే కాదు.. సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. ఈ తోటల్లో అరటి, కోకో, వక్క, పసుపు, కంద, కూరగాయలు, పూల వంటి అంతర పంటలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. కొబ్బరిలో దాదాపు 40 వేల ఎకరాల్లో అంతర పంటలు సాగవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కొబ్బరి, అంతర పంటగా అరటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అయితే, ఈ రెండు పంటలకు సంబంధించి ఏడాదిలో ఖరీఫ్, రబీ కాలానికి గాను కేవలం 8 బస్తాల యూరియా, 2 బస్తాల డీఏపీ మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కొబ్బరికి 60 కేజీలు, అరటికి 650 చెట్లకు గాను 325 కేజీల చొప్పున రెండు పంటలకు కలిపి కనీసం ఎనిమిదిన్నర బస్తాల యూరియా అవసరం. ఇంకా కొబ్బరి, పోక, కోకో వంటి మిశ్రమ పంటలున్నా అందుకు సరిపడా యూరియా ఇచ్చే అవకాశం లేదు.
సర్కారు ద్వంద్వ వైఖరి
ప్రభుత్వం ఒకవైపు అంతర, మిశ్రమ పంటల సాగుతో ఆదాయం పెంచుకోవాలని చెబుతోంది. మరోవైపు ఎరువుల విషయంలో మాత్రం ఒక్క పంటకు మాత్రమే అంటూ పరిమితులు పెడుతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యాన పంటల సాగు స్వరూపం తెలిసినప్పుడు.. ఒకే పంటకు లేదా ఒకటి రెండు పంటలకు మాత్రమే యూరియా ఎందుకు లెక్కించాలని ప్రశ్నిస్తున్నారు. యాప్‌లో పంటల వివరాలు సక్రమంగా నమోదు చేసి, ఒకే ఎకరాలో ఉన్న అన్ని పంటల అవసరాలనూ ఈ–క్రాప్ ఆధారంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తమ మద్దతు పైనే ఆధారపడి ఉందని చెబుతున్న చంద్రబాబు.. రాష్ట్రంలో రైతులకు ఎదురవుతున్న యూరియా కొరతపై నోరు మెదపకపోవడం సరికాదని విమర్శిస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కోటా పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే కోటాను పెంచకుండా యాప్‌లు, పరిమితుల పేరుతో రైతులకు బస్తాలు తగ్గించడం వల్ల ప్రయోజనమేమిటని ప్రశ్నిస్తున్నారు.


