ఫ గోదావరి పుష్కరాలకు మరో ఏడాది
ఫ కోట్లలో భక్తులు వస్తారని చెబుతున్న ప్రభుత్వం
ఫ అందుకు తగినట్టుగా కానరాని
ఘాట్‌ల విస్తరణ
ఫ జిల్లాలో 105 ఘాట్లకు కేవలం
రూ.39.48 కోట్లు
ఫ మరమ్మతులకు కూడా సరిపోవంటున్న
అధికారులు
సాక్షి, అమలాపురం: ‘‘ఈవెంట్’’ ముఖ్యమంత్రిగా పేరొందిన చంద్రబాబుకు వచ్చే ఏడాది మరో మెగా ఈవెంట్ దొరికింది. మరో ఏడాది కాలంలో గోదావరి పుష్కర మహా పర్వం జరగనుంది. ‘‘కోట్లాది మంది భక్తులు వస్తారు... రూ.వందల కోట్లతో పుష్కరాలు నిర్వహిస్తాం’’ అని బాబు ప్రభుత్వం భారీ ప్రచారానికి తెరదీసింది. అయితే పుష్కర ఘాట్‌ల ఆధునీకరణ, కొత్త వాటి నిర్మాణాలకు నిధులు కేటాయింపులు వచ్చే సరికి మాత్రం ‘‘బారెడు ప్రచారం.. మూరెడు కేటాయింపులు’’ అన్న చందాన వ్యవహరించింది. ఈ నిధులతో కొత్త నిర్మాణాలు అటుంచి ఉన్న వాటి మరమ్మతులకు సరిపోవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనేక విమర్శలు
గోదావరి పుష్కరాల సమయంలో పుణ్య స్నానాలకు మహా కుంభమేళా తరహాలో కోట్ల మంది భక్తులు తరలి వస్తారని చెప్పుకుంటుంది. అంటే 2015 పుష్కరాల కంటే ఈసారి రెండు, మూడు రెట్లు అధికంగా భక్తులు పెరిగే అవకాశముంది. కానీ ఆ స్థాయిలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ఘాట్ల విస్తరణ ప్రతిపాదనలు మాత్రం ఆమోదానికి నోచుకోలేదు. జిల్లాలో సుమారు 170 పుష్కర ఘాట్‌లు ఉన్నట్లు అంచనా ఉండగా, వాటిలో కేవలం 105 ఘాట్లకు రూ.39.48 కోట్లు మాత్రమే కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఈ నిధులు ప్రస్తుత ఘాట్ల మరమ్మతులకే సరిపోవని అధికార వర్గాలు చెబుతున్నాయి.
2015లో కోటిన్నర మంది భక్తులు
2015 గోదావరి పుష్కరాలకు నాటి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 4.90 కోట్ల మంది భక్తులు తరలివచ్చారని నాటి లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే సుమారు 2.90 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం ప్రాంతాన్ని మినహాయిస్తే.. ప్రస్తుత కోనసీమ జిల్లాలోని ఘాట్‌లకు అప్పట్లోనే కోటిన్నర మందికిపైగా భక్తులు పుష్కర స్నానాలకు వచ్చారు. ఈసారి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు కనీసం 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం చెబుతోంది. అదే అంచనాను పరిగణనలోకి తీసుకుంటే కోనసీమలోని పేరొందిన పుష్కర ఘాట్‌లో స్నానాలకు సుమారు నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అంటే 2015తో పోలిస్తే ఘాట్ల వద్ద రద్దీ రెండు,మూడు రెట్లు పెరగనుంది.
ప్రముఖ క్షేత్రాల వద్ద రద్దీ
పుష్కరాలకు వచ్చే భక్తులు ఏదో ఒక ఘాట్‌లో స్నానం చేసి వెళ్లిపోరు. ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని, వాటిని ఆనుకుని ఉన్న గోదావరి ఘాట్లలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. కోనసీమలోని కోటిపల్లి, అప్పనపల్లి, కుండలేశ్వరం, ముక్తేశ్వరం, మురమళ్ల, సోంపల్లి, అంతర్వేది ఘాట్‌లకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇటీవల కుండలేశ్వరం, అంతర్వేది, మురమళ్ల ప్రాంతాలకు సాధారణ రోజుల్లోనే భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది.
అరకొర కేటాయింపులు
జిల్లాకు పుష్కరాల సమయంలో భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఘాట్లలో బలహీనంగా ఉన్న వాటిని గుర్తించి పటిష్టం చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త ఘాట్లు నిర్మించాల్సి ఉంది. దాదాపు 12 ఏళ్ల క్రితం నిర్మించిన పలు ఘాట్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. అప్పట్లో నిర్మాణాల్లో నాణ్యతా లోపాలపై ఆరోపణలు వచ్చాయి. నాడు ఘాట్ల నిర్మాణంలో నిబంధనలు పాటించకుండా నిర్మించడంతో వరదల సమయంలో అవి దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా 2022లో గోదావరికి వచ్చిన మూడవ అతి పెద్ద భారీ వరదతో పలు ఘాట్‌లు మరింత దెబ్బతిన్నాయి.
మరింత పెరిగే అవకాశం
2015తో పోలిస్తే 2027 పుష్కరాలకు మూడు, నాలుగు రెట్లు భక్తులు వస్తారని ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఘాట్‌ల సామర్థాన్ని కూడా కనీసం రెండు, మూడు రెట్లు వెడల్పు చేయాలి. అంటే ఇప్పుడున్న వాటిలో పటిష్టంగా ఉన్న వాటిని మరింత పొడవుగా విస్తరించాల్సి ఉంది. దెబ్బతింటే వాటిని తొలగించి కొత్త వాటిని నిర్మించాలి. నిధుల కేటాయింపులు అరకొరగా ఉన్నా జిల్లాకు చెందిన మంత్రి, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దీనిపై నోరుమెదపకపోవడం గమనార్హం. భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుందని అంచనాలు వేస్తున్న ప్రభుత్వం.. ఘాట్లకు మాత్రం కోట్లలో కాకుండా కంటితుడుపు నిధులు కేటాయించడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.


