అమలాపురం టౌన్: ఎయిడ్స్‌పై అపోహలు విడనాడాలని, ఆ వ్యాధిపై అనవసర ప్రచారాలు నమ్మొద్దని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.రామాంజనేయులు అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో బుధవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ రామాంజనేయులు ప్రసంగించారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ అనూష, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్, స్టాటిస్టికల్ అధికారి ఎం.వీరబాబుతో కలిసి ఆయన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఏసీవో) మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. అనంతరం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఐఈసీ పోస్టర్లు, ఆరోగ్య దీపికలను ఆవిష్కరించారు. డాక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 25 గ్రామాల్లో ఎయిడ్స్ నియంత్రణపై ప్రత్యేక విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో కూడా ఓ కళాజాత ఎయిడ్స్‌పై ప్రదర్శన నిర్వహించింది. కార్యక్రమంలో క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ ఎ.బుజ్జిబాబు, దిశా ప్రోగ్రామ్ మేనేజర్ జి.శ్రీనివాస్ పాల్గొన్నారు.


