అమలాపురం టౌన్: వారానికి ఐదు రోజుల పని దినాలను డిమాండ్ చేస్తూ జిల్లాలో ఏడు బ్యాంకుల యూనియన్లకు చెందిన అధికారులు, ఉద్యోగులు బుధవారం అమలాపురంలో నిరసన తెలిపారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమలాపురం రీజినల్ సెక్రటరీ వై.గణేష్ తెలిపారు. దాదాపు 300 మంది అధికారులు, ఉద్యోగులు బుధవారం సాయంత్రం బ్యాంక్‌ల పనివేళలు ముగిశాక అమలాపురంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచికి చేరుకున్నారు. అక్కడి నుంచి స్థానిక యూనియన్ బ్యాంక్ ఇండియా మెయిన్ బ్రాంచి వరకూ నిరసన ప్రదర్శన చేశారు. స్టాఫ్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఎస్‌బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రటరీ కె.సురేష్, సీనియర్ లోకల్ సెక్రటరీస్ జి.రామారావు, రామకృష్ణ, కృష్ణ గౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


