● దిశ బిల్లు రద్దుతో
మహిళలకు తప్పని తిప్పలు
● రక్షణ వ్యవస్థను నీరు గార్చిన
కూటమి ప్రభుత్వం
● జగన్ పేరు జనంలో
ఉండకూడదనే తొలగింపు
● సర్వత్రా ఆక్షేపణ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
అల్లవరం: దిశ అంటే మహిళలకు భరోసా.. దిక్సూచి.. రక్షణ. అంతటి గొప్ప యాప్‌ను అరచేతికి తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. దానిని ఒక్క సంతకంతో రద్దు చేసి రాష్ట్రంలోని ఆడబిడ్డల భద్రతను ప్రమాదంలోకి నెట్టేసింది కూటమి ప్రభుత్వం. పని ప్రదేశంలో వేధింపులు, ఆత్యాచారాలు, చిన్నారులపై ఆఘాయిత్యాలను అరికట్టే వ్యవస్థను కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. ఈ వ్యవహారంపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఏ మంచి పనినైనా కూటమి ప్రభుత్వం సమాధి చేస్తోందని మండిపడుతున్నారు.
రాష్ట్రంలో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ని తూర్పుగోదావరి జిల్లాలో 2020 ఫిబ్రవరి 8 న ప్రారంభించారు. వేలాది మంది విద్యార్థుల సమక్షంలో నన్నయ వర్సిటీలో దిశ యాప్‌ని డౌన్‌లోడ్ చేయించి వారికి అవగాహన కల్పించారు. ఇది అందుబాటులోకి వచ్చాక ఆకతాయిలు, నేరగాళ్లలో వణుకు పుట్టింది.
మహిళలకు రక్షణ వలయం
దిశ యాప్ కేవలం కఠిన శిక్షల కోసమే కాకుండా ఒక సమగ్ర భద్రతా వ్యవస్థగా ముద్రవేసుకుంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన మొబైల్ నుంచి ఎస్‌ఓఎస్ బటన్ నొక్కినా, షేక్ చేసినా పోలీసులు, కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసేలా రూపొందించారు. యాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 14 వేల మంది మహిళలు వారి సెల్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా 1200 మంది బాధితులు చట్టం నుంచి రక్షణ పొందారు.
దిశతో సత్వర న్యాయం
● కేసు నమోదు కాగానే 14 రోజుల్లో చార్జిషీటు.. అది దాఖలు చేసిన 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష వేసేందుకు ప్రత్యేక పోక్సో కోర్టులు ఏర్పాటుచేశారు. 2017లో 156 రోజుల వ్యవధి తీసుకుంటే, 2022 నాటికి కేవలం 28 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేశారు.
● ఈ మేరకు జిల్లాలో 18 మహిళా పోలీస్‌స్టేషన్లు, గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో మహిళా పోలీసులతో క్షేత్రస్థాయిలో రక్షణ వ్యవస్థ, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.
పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది అధికారం తీరు
రాష్ట్రంలో మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుందని అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దిశ చట్టాన్ని అమలుచేస్తే చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడం దారుణం. దిశ యాప్‌ని రద్దు చేస్తే మహిళలకు రక్షణ ఏలా ఉంటుందని ప్రశ్నించారు. పిచ్చోడు చేతిలో రాయిలా అధికారం ఉంది. కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలతో దోపిడీలు, ఆత్యాచారాలు, వేధింపులు, హత్యలు పెరుగుతాయని, మహిళా రక్షణ ప్రశ్నార్ధకంగా ఉంటుంది.
– పాముల రాజేశ్వరీదేవి,
రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్
‘దిశ’ రద్దు మహిళా భద్రతా విధానమా?
మహిళల భద్రతకు ఏర్పాటుచేసిన దిశ బిల్లును రద్దు చేయడం మహిళల భద్రతా విధానమా? ఈ యాప్‌ని రద్దు చేయడం మహిళ రక్షణకు తీవ్ర విఘాతం, దిశ వ్యవస్థకు చట్టబద్ధత లేదని హోంమంత్రి అనిత పదే పదే చెప్పడం బాధ్యతా రహిత్యమే. చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత మీది కాదా, చంద్రబాబు పాలనతో మహిళలపై అనేక దాడులు, ఆత్యాచారాలు పెరిగాయి. వీటిని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే వ్యవస్థను రద్దు చేయడంలో కాదు. దాన్ని మరింత సమర్ధంగా అమలుచేయడంలో చిత్తశుద్ధి చూపాలి.
– చింతా అనురాధ, మాజీ ఎంపీ, అమలాపురం
జగన్ చేసిన మంచిని చెరపడమే కూటమి లక్ష్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రజలకు కనిపించకుండా చేస్తోంది. దిశ యాప్ ద్వారా ఆయన మహిళలకు వజ్రాయుధంలా రక్షణ కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లల్లో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. హోంమంత్రి అనిత వల్లే మహిళలపై అనేక దాడులు, ఆత్యాచారాలు జరుగుతూ రక్షణ లేకుండా పోయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో దిశ యాప్‌ను రద్దు చేయడం మహిళలకు భద్రత లేకుండా చేయడమే.
– వంగా గిరిజాకుమారి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు
నేరస్తుల్లో భయం
● దిశ యాప్‌లో నమోదైన కేసులకు వేగవంతమైన విచారణ, ఫోరెన్సిక్ ఆధారాలు, ప్రత్యేక న్యాయస్థానాలతో నేరస్తుల్లో భయం పెరిగింది. దీంతో 2024 నాటికి 27 శాతం నేరాల రేటు గణనీయంగా తగ్గింది. దిశ యాప్ రద్దుతో జిల్లా వ్యాప్తంగా మహిళలకు రక్షణ కరువైయ్యింది.
● ఒంటరిగా ప్రయాణించే మహిళలు రాత్రి వేళల్లో ఇంటికి చేరేదెలా అన్న ఆందోళనలో ఉన్నారు. దిశతో రక్షణ వ్యవస్థ కూప్పకూలింది. నేరస్తులు మళ్లీ పెట్రేగిపోతారని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఈ యాప్‌ను పునరుద్ధరించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు భద్రత కల్పించలేని చంద్రబాబు ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెపుతామని హెచ్చరిస్తున్నారు.
దిశ చట్టాన్ని కొనసాగించాలి
దిశ యాప్ అయినా, మరేదైనా సంక్షేమ పథకం ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చేదిగా ఉంటే దాన్ని ఏ ప్రభుత్వమైనా కొనసాగించాలి తప్ప రద్దు చేయకూడదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని, యాప్‌ను రద్దు చేయడం మంచిది కాదు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రజల స్థితిగతులు మారుతున్నాయా ఆలోచించాల్సి ఉంది.–బడుగు సుబ్బాయమ్మ,సామాజిక కార్యకర్త, వెదిరేశ్వరం


